రాజమహేంద్రవరం డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం

రాజమహేంద్రవరం, ఆంధ్రప్రభ: నగరంలో దశాబ్దాలుగా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న కంపోస్ట్ యార్డు, చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే దిశగా చర్యలు వేగవంతమయ్యాయని ఎమ్మెల్యే ఆదిరెడ్డి అన్నారు. శుక్రవారం పురపాలక శాఖ మంత్రి నారాయణ, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మున్సిపల్ అధికారులతో కలిసి పేపర్ మిల్లు ఎదురుగా ఉన్న డంపింగ్ యార్డుతో పాటు క్వారీ ప్రాంతంలోని లెగసీ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్‌ను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ.. రత్నంపేట, లూథర్ గిరి, ఆర్‌అండ్‌బీ కాలనీ ప్రాంతాల ప్రజలు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న కంపోస్ట్ యార్డు సమస్యకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, మంత్రి నారాయణ సారథ్యంలో శాశ్వత పరిష్కారం లభిస్తోందన్నారు.

పెద్దాపురంలో నిర్మాణంలో ఉన్న ‘వేస్ట్ టు ఎనర్జీ’ ప్లాంట్ పూర్తయిన తర్వాత రాజమహేంద్రవరం నగరంలోని చెత్త సమస్యకు మరింత సమర్థవంతమైన పరిష్కారం లభిస్తుందని తెలిపారు. రాష్ట్రాన్ని డంపింగ్ యార్డుల రహితంగా మార్చే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఘన వ్యర్థాల ప్రాసెసింగ్‌ను వేగవంతం చేస్తోందన్నారు.

రాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని రాజమహేంద్రవరం నగరాన్ని స్వచ్ఛమైన, సుందరమైన నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు.