పేదల సంక్షేమమే ప్రభుత్వం లక్ష్యం..

పేదల సంక్షేమమే ప్రభుత్వం లక్ష్యం..
- అర్హులందరికీ ఇళ్ల పట్టాలు అందిస్తా
- ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హామీ
ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని భూపాలపల్లి ఎమ్మెల్యే గంధ సత్యనారాయణ రావు అన్నారు. భూపాలపల్లి క్యాంపు కార్యాలయంలో గురువారం కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీతో పాటు మున్సిపాలిటీ పరిధిలోని 5, 6, 24వ వార్డులకు చెందిన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు చెక్కులు, పట్టాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ వంటి పథకాల ద్వారా ఆర్థికంగా బలహీన వర్గాల కుటుంబాలకు గణనీయమైన ఉపశమనం కలుగుతుందని తెలిపారు. అమ్మాయిల వివాహాలకు ఆర్థిక సహాయం అందించడం ద్వారా కుటుంబాలపై భారాన్ని తగ్గించడమే ఈ పథకాల ప్రధాన లక్ష్యమని అన్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం చేపట్టిన ప్రతి పథకం ప్రజలకు చేరేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు లబ్ధిదారులు పాల్గొన్నారు.
