సమీకృత వ్యవసాయంతో రైతులకు అదనపు ఆదాయం

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం గొలనుకొండలోని రైతు వేదికలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) సౌజన్యంతో వ్యవసాయ శాఖ వారి ఆధ్వర్యంలో రైతు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వర్షాధార ప్రాంతాల్లో సమీకృత వ్యవసాయ విధానాలపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించారు.వర్షాధార ప్రాంతాల్లో వాతావరణ మార్పులు, అనిశ్చిత వర్షపాతం, సాగునీటి కొరత వంటి సమస్యలను అధిగమించి రైతులు స్థిరమైన ఆదాయం పొందేందుకు సమీకృత వ్యవసాయ విధానం ఎంతో ఉపయోగకరమని వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు సూచించారు.

ఆలేరు ఏడిఏ నిర్మల మాట్లాడుతూ.. వ్యవసాయ క్షేత్రంలో కేవలం ఒక పంటపై ఆధారపడకుండా, రైతు భూమి, నీటి లభ్యత, వాతావరణ పరిస్థితులు, మార్కెట్ అవకాశాలకు అనుగుణంగా పంటల సాగుతో పాటు పశుపోషణ, గొర్రెలు–మేకల పెంపకం, కోళ్ల పెంపకం, ఉద్యాన పంటలు, కూరగాయలు, పశుగ్రాస పంటలు, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలను సమన్వయం చేసుకోవాలని తెలిపారు.వర్షాధార భూముల్లో పంటల వైవిధ్యీకరణలో భాగంగా వర్షపాతం తక్కువగా ఉండే ప్రాంతాల్లో రైతులు తమ భూమి స్వభావం, నీటి లభ్యతను బట్టి కంది, పెసర, మినుము, జొన్న, మొక్కజొన్న, నువ్వులు, వేరుశనగ వంటి ఆరుతడి పంటలను ప్రోత్సహించాలని సూచించారు.

తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం- భువనగిరి శాస్త్రవేత్త శ్రీలత మాట్లాడుతూ.. వర్షాధార ప్రాంతాల్లో ఒకే పంటపై ఆధారపడితేవర్షాభావం లేదా పంట నష్టం సంభవించినప్పుడు రైతు ఆదాయంపై తీవ్ర ప్రభావం పడుతుందని, సమీకృత వ్యవసాయ విధానంలో ఒక విభాగంలో నష్టం వచ్చినా ఇతర విభాగాల ద్వారా ఆదాయం పొందే అవకాశం ఉంటుందని తెలిపారు.పంటలు–పశుపోషణ పరస్పర అనుసంధానంసమీకృత వ్యవసాయంలో పంటల అవశేషాలను పశువులకు పశుగ్రాసంగా వినియోగించుకోవచ్చని, పశువుల నుంచి లభించే పేడ, మూత్రాన్ని కంపోస్టు, జీవ ఎరువుల తయారీలో ఉపయోగించి తిరిగి పొలాల్లో వినియోగించడం ద్వారా బయటి నుంచి కొనుగోలు చేసే ఎరువులపై ఆధారపడటాన్ని తగ్గించవచ్చని సూచించారు.

ఆలేరు మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ పొలాల గట్లపై పండ్ల మొక్కలు, కూరగాయలు, పశుగ్రాస పంటలు, అనువైన చెట్లను పెంచుకోవడం ద్వారా అదనపు ఆదాయం పొందడంతో పాటు భూమి సంరక్షణ, జీవ వైవిధ్యం పెంపొందించుకోవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో పి ఎ సి ఎస్ సి ఈ ఓ వెంకట్ రెడ్డి, గ్రామ సర్పంచ్ యాదిరెడ్డి, ఉప సర్పంచ్ లు యాదగిరి, దశరథ వ్యవసాయ విస్తరణ అధికారులు అంజయ్య, శివకుమార్, భార్గవి, తిరుమలరావు, ఆత్మ బి టి యం వేణు, రైతులు పాల్గొన్నారు.