30thaprilchintana | హింస – అహింసపై తాత్విక వివరణ

30thaprilchintana | హింస – అహింసపై తాత్విక వివరణ
30thaprilchintana | అహింసపై మహాభారతంలో ఆసక్తికర కథ
కౌశికుడు – ఇల్లాల మధ్య సంభాషణ
ధర్మవ్యాధుడి జీవన విధానం
నిజమైన ధర్మం ఏమిటి?
30thaprilchintana | ధర్మాలలోకెల్లా ఉత్తమమైన ధర్మంగా భావించబడే అహింస గురించి ఎఱ్ఱాప్రెగడ రచించిన ఆంధ్ర మహాభారతం అరణ్యపర్వంలో ఒక ఆసక్తికరమైన కథ ఉంది. మిథిలా నగరంలో మాంసాన్ని అమ్ముకుని జీవనం సాగించే ధర్మవ్యాధుడనే వ్యక్తి ఉండేవాడు. అతడిని వెతుక్కుంటూ ఒకరోజు కౌశికుడనే విప్రుడు వచ్చాడు. ఆ కౌశికుడు అంతకు ముందు రోజు ఒక ఇంటికి భిక్షకు వెళ్లాడు. ఆ ఇంటి ఇల్లాలు తన భర్తకు సేవ చేస్తూ అతనికి భిక్ష వేయడంలో ఆలస్యం చేసిందని ఆమెపై కోపగించుకోగా, ఆమె నాలుగు చివాట్లు పెట్టింది.
“భిక్ష వేయడంలో జరిగిన ఆలస్యం నీకు అధర్మంగా అనిపించవచ్చునేమో గాని, నాకు మాత్రం నా భర్తకు సేవ చేయడం ముందు ధర్మంగా తోస్తుంది. అలసిపోయి ఇంటికి వచ్చిన అతనికి ముందుగా సేవ చేసి, తరువాతే నీకు భిక్ష ఇవ్వాలని అనిపించింది” అని ఆమె ఘాటుగా చెప్పింది. అలాగే, “నీ వాలకం చూస్తుంటే, నీవు తెలుసుకోవలసిన ధర్మసూక్ష్మాలు ఇంకా చాలా ఉన్నాయనిపిస్తోంది. కాబట్టి, ఆలస్యం చేయకుండా మిథిలా నగరంలో నివసిస్తున్న ధర్మవ్యాధుడి దగ్గరకు వెళ్లి నేర్చుకో” అని సూచించింది.
ఆమె మాటలు విని కౌశికుడు ధర్మవ్యాధుడి ఇంటిని వెతుక్కుంటూ వచ్చాడు. అయితే అక్కడ చూసిన దృశ్యం అతనికి అసహ్యంగా అనిపించింది. “ఏమిటీ ఈ హింస? దీనితోనే బ్రతుకుతున్నావా?” అని చిరాకుతో ధర్మవ్యాధుడిని ప్రశ్నించాడు. “నీవు ధర్మసూక్ష్మాలు తెలిసినవాడివని చెప్పారు. కానీ నీ పని చూస్తే నాకు బాధ కలుగుతోంది” అని అన్నాడు.

కౌశికుడి మాటలు విన్న ధర్మవ్యాధుడు శాంతంగా స్పందించాడు— “అందులో తప్పేమీ లేదు స్వామీ. ఎవరి ధర్మాన్ని వారు నిర్వర్తించడమే నిజమైన ధర్మం. నేను స్వయంగా జంతువులను చంపను. ఇతరులు చంపి తెచ్చిన మాంసాన్ని అమ్ముకుని జీవనం సాగిస్తున్నాను. వచ్చిన డబ్బులో కొంత భాగాన్ని దానధర్మాలకు వెచ్చిస్తాను. అలా సంపాదించిన ధనంతో బ్రతకడంలో నాకు మనశ్శాంతి ఉంది.
హింస, అహింసల గురించి నీకు సందేహాలు ఉన్నట్లు అనిపిస్తోంది. వాటిని నివృత్తి చేసే కొన్ని విషయాలు చెబుతాను విను” అని చెప్పి వివరించాడు. “భూమి, నీరు, ఆకాశం అన్నీ సూక్ష్మజీవులతో నిండిపోయి ఉంటాయి. కాబట్టి మనం నిత్యం చేసే పనుల్లో కూడా ఏదో ఒక రకంగా జీవహింస జరుగుతూనే ఉంటుంది. పూర్తిగా హింస లేకుండా జీవించడం మానవుడికి సాధ్యం కాదు. ఈ విషయాన్ని గ్రహించలేని వారు తాము అహింసతోనే బ్రతుకుతున్నామని భ్రమపడుతుంటారు. నిజానికి ఈ ప్రపంచంలో హింస చేయని వ్యక్తి ఎవరూ లేరు. అయితే తెలిసి ఎవరికీ హాని చేయకుండా, హింసకు దూరంగా జీవించడానికి ప్రయత్నించడం మన కర్తవ్యము” అని ధర్మవ్యాధుడు ఉపదేశించాడు.
భట్టు వెంకటరావు
9959120528
