Mines | 26 జిల్లాల్లో గనుల శాఖ కార్యాలయాలు

రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర

Mines| ఆంధ్రప్రభ బ్యూరో, ఒంగోలు : రాష్ట్రంలో 26 జిల్లాల్లో గనులశాఖ కార్యాలయాలను నిర్మిస్తామని రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆదివారం స్థానిక దక్షిణ బైపాస్ రోడ్డు వద్ద 2.14కోట్ల రూపాయలతో నిర్మించనున్న నూతన కార్యాలయానికి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయస్వామితో క‌లిసి శంకుస్థాపన చేశారు.

ఈసందర్భంగా కొల్లురవీంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో మొదటిగా ప్రకాశం జిల్లా ఒంగోలులో గనులశాఖ కార్యాలయాన్ని నిర్మించడానికి చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఒంగోలులో నిర్మించే గనుల శాఖ కార్యాలయాన్ని మోడల్ కార్యాలయంగా నిర్మించడానికి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఒంగోలులో 20 సెంట్లు భూమిలో రూ.2కోట్ల14 లక్షల వ్యయంతో సుందరమైన భవనాన్ని నిర్మించడానికి చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు.

రాష్ట్రంలో వినియోగ‌దారులు ఇబ్బంది ప‌డ‌కుండా ఉచిత ఇసుక పాలసీని అమలు చేస్తున్నామని మంత్రి చెప్పారు. గ్రానైట్ పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మైనింగ్ పాలసీని అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు. అమెరికా తర్వాత రాష్ట్రంలో వైజాగ్‌లో పరిశ్రమలు స్థాపించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పారు.

అమెరికా తర్వాత గూగుల్ సంస్థ వైజాగ్‌లో పరిశ్రమలను సాధించడానికి ముందుకు వచ్చిందని ఆయన చెప్పారు. ఇటీవల జరిగిన వైజాగ్ పారిశ్రామిక వేత్తల పెట్టుబడుల సదస్సులో 13.5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారని ఆయన చెప్పారు. పరిశ్రమల స్థాపన వల్ల 17 లక్షల 50వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని ఆయన చెప్పారు.

అనంత‌రం బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ.. ప్రకాశం జిల్లాలో గ్రానైట్ పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయని ఆయన చెప్పారు. ఒంగోలులో పారిశ్రామిక వేత్తలకు అందుబాటులో గనుల శాఖ కార్యాలయం ఏర్పాటుచేయడం సంతోషక‌ర‌మని చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసురెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, సంతనూతలపాడు శాసన సభ్యులు బీఎన్ విజయ్ కుమార్, కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, ఒంగోలునగర పాలక సంస్థ మేయర్ గంగాడ సుజాత, ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ షేక్ రియాజ్, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల కృష్ణ, గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ టి.జె.రాజశేఖర్, గ్రానైట్ పరిశ్రమల యజమానులు శిద్దా సుధీర్, చలువాది బద్రినారాయణ, రవి చందర్, లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.