Microphone | మనం మాట్లాడుకున్నది యాడ్స్‌లో ఎలా కనిపిస్తుంది ?

Microphone | ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్‌: ఈ రోజు ఏం వండుకుందాం అని ఇంట్లో వాళ్లలతో మాట్లాడుతున్నా.. ఏదైనా విషయం గురించి గూగుల్‌ లో సర్చ్‌ చేసినా.. లేదా మీరు స్నేహితులతో ఏదైనా ఒక కొత్త వస్తువు గురించి మాట్లాడుకున్నా… గంట తిరగకముందే అదే వస్తువుకు సంబంధించిన ప్రకటనలు మీ ఇన్‌స్టాగ్రామ్ లేదా ఫేస్‌బుక్ ఫీడ్‌లో కనిపిస్తాయి! యాదృచ్ఛికమా? లేక మన ఫోన్లు నిజంగానే మనం ఏం మాట్లాడుకుంటున్నామో వింటున్నాయా? ఈ సందేహం ఇప్పుడు ప్రతి ఒక్కరినీ వేధిస్తోంది. అసలు దీని వెనుక ఉన్న టెక్నాలజీ ఏంటో తెలుసుకుందాం రండీ..

అసలు ఫోన్ వింటుందా?
టెక్నాలజీ దిగ్గజాలైన గూగుల్, ఆపిల్, మెటా సంస్థలు తామ యూజర్ల ప్రైవేట్ సంభాషణలను వినడం లేదని, ప్రకటనల కోసం రికార్డ్ చేయడం లేదని స్పష్టం చేస్తున్నాయి. మరి మన మాటలకు తగ్గట్టుగా యాడ్స్ ఎలా వస్తున్నాయి? దీనికి ప్రధాన కారణాలు లేకపోలేదు..

  1. డేటా ట్రాకింగ్
    మీరు దేని గురించి మాట్లాడుతున్నారో అది విననక్కర్లేదు, మీరు దేని గురించి ఆలోచిస్తున్నారో యాప్స్ అంచనా వేయగలవు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు (Location Tracking)?, మీ స్నేహితులు ఏమి సెర్చ్ చేస్తున్నారు?, మీకు ఆసక్తి ఉన్న విషయాలు ఏమిటి? ఈ డేటాతో ఏఐ మీకు ఏం కావాలో పసిగట్టేస్తుంది. మీరు ఆ వస్తువు గురించి గూగుల్‌లో సెర్చ్ చేసినా లేదా అలాంటి కంటెంట్ ఉన్న వీడియోలను చూసినా, అల్గారిథమ్స్ వెంటనే యాక్టివేట్ అవుతాయి.
  2. అల్గారిథమిక్ ప్రెడిక్షన్
    ప్రస్తుత అల్గారిథమ్స్ చాలా తెలివైనవి. మీ వయస్సు, నివసించే ప్రాంతం, మీ అభిరుచుల ఆధారంగా మీకు ఏది అవసరమో అవి ముందే ఊహించగలవు. మీరు ఏదైనా వస్తువును కొనే అవకాశం ఉన్న సమయాన్ని కూడా అవి పసిగట్టి, కరెక్ట్ టైమ్‌లో యాడ్స్ చూపిస్తాయి.
  3. డిజిటల్ ఫుట్‌ప్రింట్
    మనం చేసే చిన్న చిన్న సెర్చ్‌లు, ఆన్‌లైన్ షాపింగ్, క్లిక్ చేసే వెబ్‌సైట్లు.. ఇవన్నీ ఒక పెద్ద ‘డిజిటల్ ప్రొఫైల్’ను తయారు చేస్తాయి. మనం ఆ వస్తువు గురించి మాట్లాడకపోయినా, ఆ వస్తువుకు సంబంధించిన ఇతర విషయాలను మనం ఎప్పుడో ఒకప్పుడు సెర్చ్ చేసి ఉంటాం. అదే మనకు యాడ్‌గా కనిపిస్తుంది.

అయితే మీ ప్రైవసీని కాపాడుకోవడానికి చిట్కాలు కూడా ఉన్నాయండోయ్‌.. మీకు మీ ప్రైవసీపై ఆందోళన ఉంటే, మీ మొబైల్‌ లో ఈ సెట్టింగ్స్ త్వరగా మార్చేసుకోండి.

  • మైక్రోఫోన్ పర్మిషన్స్: ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి, ఏయే యాప్స్‌కు మైక్రోఫోన్ పర్మిషన్ ఉందో చెక్ చేయండి. అవసరం లేని యాప్స్‌కు పర్మిషన్ తీసేయండి.
  • గూగుల్ అకౌంట్ సెట్టింగ్స్‌లో ‘వెబ్‌ & యాప్‌ యాక్టీవిటీ’ని ఆఫ్ చేయండి.
  • ఫోన్ సెట్టింగ్స్‌లో ‘యాడ్స్‌’ ఆప్షన్‌లోకి వెళ్లి, ‘డిలేట్ ఆడ్వటైసింగ్‌ ఐడి ‘ చేయండి లేదా
    ‘పర్సనలైజైడ్ యాడ్స్‌’ని ఆఫ్ చేయండి.
  • కొత్త యాప్స్ ఇన్‌స్టాల్ చేసేటప్పుడు అవి అడిగే పర్మిషన్లను జాగ్రత్తగా గమనించండి.

మీ ఫోన్ మిమ్మల్ని గూఢచర్యం చేయడం లేదు, కానీ మీ డిజిటల్ అలవాట్లను మాత్రం నిశితంగా గమనిస్తోంది. కొంచెం అప్రమత్తంగా ఉండి, సెట్టింగ్స్‌లో మార్పులు చేసుకోవడం ద్వారా మీ ప్రైవసీని మరింత పదిలంగా ఉంచుకోవచ్చు.

Leave a Reply