mi vs pbks|ఇవాళ ముంబై వ‌ర్సెస్‌ పంజాబ్

mi vs pbks|ఇవాళ ముంబై వ‌ర్సెస్‌ పంజాబ్

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఐపీఎల్ 2026 సీజన్‌లో ఇవాళ మ‌రో ర‌స‌వ‌త్త‌ర పోరుకు తెర‌లేవ‌నుంది. నేడు ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ ఢీకొననున్నాయి. ముంబైలోని వాంఖ‌డే స్టేడియంలో రాత్రి 7.30గంట‌ల‌కు మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ముంబై వరుస ఓటములతో సతమతమవుతోంది. ఆడిన నాలుగు మ్యాచుల్లో ఒక్క మ్యాచ్ మాత్ర‌మే గెలిచి మిగ‌తా మూడు మ్యాచుల్లో ఓట‌మి పాలైంది. అయితే ఈ మ్యాచ్ ముంబైకి చాలా కీలకం. భీకర ఫామ్‌లో ఉన్న పంజాబ్‌ను ఎదుర్కోవాలి అంటే తీవ్రంగా క‌ష్ట‌ప‌డాల్సి ఉంటుంది. అలాగే పంజాబ్ జ‌ట్టు గ‌తేడాది మాదిరిగా ఈ ఐపీఎల్‌లోనూ మంచి ఊపు మీద ఉంది. ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడింట్లో గెలిచింది. ఐపీఎల్ టోర్నీల్లో ఎంఐ మరియు పంజాబ్ ఇరు జట్లు ముఖాముఖి పోరులో 34 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఈ 34 మ్యాచ్‌ల్లో ఎంఐ జట్టు 17 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా పంజాబ్ జట్టు 17 సార్లు గెలిచింది.

ముంబై ఇండియన్స్ ఈ సీజ‌న్‌ను విజ‌యంతో ఆరంభించినా ఆ తర్వాత జ‌రిగిన మూడు మ్యాచ్‌ల్లో వ‌రుస‌గా ఓడిపోయింది. బ్యాటింగ్‌లో విఫ‌ల‌మ‌వుతుండ‌టంతో ప‌రాజ‌యాల‌ను ఎదుర్కొంటుంది. అయితే గాయ‌ప‌డిన హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఈ మ్యాచులో ఆడ‌టం అనుమానంగా ఉంది. అదేజ‌రిగితే ముంబైకి క‌ష్టాలు త‌ప్ప‌వు. రోహిత్ ఆడకపోతే ముంబై బ్యాటింగ్ ఆర్డర్ బలహీనపడే అవకాశం ఉంది. సీనియర్లు సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా బ్యాట్ ఝుళిపించాల్సిన అవ‌స‌రం ఉంది.

మరోవైపు, పంజాబ్ కింగ్స్ తిరుగులేని ఆధిక్యం ప్ర‌ద‌ర్శిస్తోంది. ఆ జ‌ట్టు బ్యాటింగ్ ఆర్డ‌ర్ బ‌లంగా ఉంది. టాపార్డ‌ర్ తోపాటు లోయ‌ర్ ఆర్డ‌ర్ బ్యాట‌ర్లు కూడా ఇర‌గ‌దీస్తున్నారు. ముఖ్యంగా భారీ లక్ష్యాలను ఛేదిస్తూ విజ‌యాల‌ను సాధిస్తోంది. ఈ సీజన్‌లో ఇప్పటికే రెండుసార్లు 200 పైచిలుకు పరుగులను అలవోకగా ఛేదించి ప్రత్యర్థి జట్లకు వణుకు పుట్టిస్తోంది. బుమ్రా నేతృత్వంలోని ముంబై బౌలింగ్ గ‌త మ్యాచుల‌లో అంత‌గా ప్ర‌భావం చూప‌లేక‌పోయింది. ఈ మ్యాచులోనైనా రాణించాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉంది. లేదంటే ముంబైకి మరో ఓటమి త‌ప్ప‌దు.

పంజాబ్‌ కింగ్స్‌తో కీలక పోరుకు ముంబై ఇండియన్స్‌ స్టార్‌ బ్యాటర్‌ రోహిత్‌శర్మ దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో తొడ కండరాల గాయంతో రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. అయితే అత‌ని ఫిట్‌నెస్‌పై స్పష్టత రావాల్సి ఉంది. ప్రాక్టీస్‌ సెషన్‌కు హాజరైన రోహిత్‌ కొద్దిసేపు నెట్స్‌లో బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేశాడు.

Leave a Reply