MLC Elections – ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు నామినేష‌న్లు షురూ … ఎపి, తెలంగాణ‌లోని ఆరు స్థానాల‌కు ఎన్నిక‌లు

అమ‌రావ‌తి| హైద‌రాబాద్ – ఆంధ్ర‌ప్ర‌భః ఏపీ, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల నోటిఫికేషన్ విడుదలైంది.. నేటి నుంచి నామినేషన్ దాఖలు ప్రాక్రియ ప్రారంభమైంది.. రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు చొప్పున ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నెల 10 తేది వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.. ఫిబ్ర‌వ‌రి ఫిబ్ర‌వ‌రి 27న పోలింగ్ ఉంటుంది. మార్చి 3న ఓట్ల లెక్కింపు చేప‌ట్ట‌నున్నారు. ఈ మేర‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది.

తెలంగాణ‌లో మెదక్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌-క‌రీంన‌గ‌ర్ ఉపాధ్యాయ నియోజ‌క వ‌ర్గానికి ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్నారు. అదే స్థానంలో ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌లు కూడా జ‌ర‌గ‌నున్నాయి. వీటితో పాటు వ‌రంగ‌ల్‌-ఖ‌మ్మం-న‌ల్గొండ ఉపాధ్యాయ నియోజ‌కవ‌ర్గానికి కూడా ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్నారు.

అటు ఏపీలో ఉమ్మ‌డి ఉభ‌య‌గోదావరి, కృష్ణా-గుంటూరు ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌కవ‌ర్గాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అలాగే శ్రీకాకుళం-విజ‌య‌న‌గ‌రం-విశాఖ‌ప‌ట్నం ఉపాధ్యాయ నియోజ‌క వ‌ర్గానికి ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు ఈసీ షెడ్యూల్ విడుద‌ల చేసింది.

గెలుపే ధ్యేయంగా కాంగ్రెస్

తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ రెండు స్థానాలను గెలుచుకోవాలని పట్టుదలతో ఉంది.. మరో స్థానం మిత్ర పక్షానికి ఇచ్చే అలోచనలో ఉంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డి ఈ సారి పోటీ చేయనని ప్రకటించారు. తమ పేర్లు పరిశీలించాలని ఆశావాహులు అధిష్టానం చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇక కరీంనగర్ జిల్లాకు చెందిన విద్యా సంస్దల ఛైర్మన్ నరేందర్ రెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ కోసం రెండు నెలలు ముందే ప్రచారం మొదలు పెట్టారు. నాలుగు ఉమ్మడి జిల్లాల్లో ప్లెక్సీలు హోర్డింగ్ లతో అభ్యర్దిగా ప్రచారం మొదలు పెట్టారు. అతడి అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఇప్పటికే ఖరారు చేసింది.

బలమైన అభ్యర్ధులతో బిజెపి

బీజేపీ ఓ అడుగు ముందుకేసి.. పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్ధులను ప్రకటించి పోటీలో ముందు వరుసలో నిలిచింది. పట్ట భద్రుల ఎమ్మెల్సీ అభ్యర్దిగా సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువుకు చెందిన అంజిరెడ్డిని, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా పెద్ద పల్లి జిల్లా బంధం పల్లికి చెందిన మల్క కొమురయ్య తమ అభ్యర్దులుగా కాషాయ పార్టీ ప్రకటించింది. బీజేపీ తన అభ్యర్ధులను ప్రకటించి బరిలో దించడంతో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి మొదలైంది. ఈ నియోజకవర్గం పరిధిలో బీజేపీకి నలుగురు ఎంపీలు, ఏడుగులు ఎమ్మెల్యేలు ఉండటం తమకు కలిసొస్తుందని భావిస్తున్నారు. బీజేపీ అభ్యర్ధులు అప్పుడే ప్రచార పర్వానికి సైతం తెరలేపారు..

ఊగిసలాటలో బిఆర్ఎస్

ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌ల‌లో పోటీ చేసే విష‌యంలో బిఆర్ ఎస్ ఎటు తేల్చుకోలేక‌పోతున్న‌ది.. అభ్య‌ర్ధుల ఎంపిక‌పై ఇంత వ‌ర‌కు ఎటువంటి నిర్ణ‌యం తీసుకోలేదు.. అయిన‌ప్ప‌టికీ కరీంనగర్ జిల్లాకు చెందిన డాక్టర్ బీఎన్ రావు బీఆర్ఎస్ తరపున బరిలో దిగేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఉమ్మడి జిల్లాల్లో భారీ హోర్డింగ్ లు ఏర్పాటు చేశారు. బీఆర్ ఎస్ అభ్యర్ధిగా ప్రచారం చేసుకుంటున్నారు. ఆర్మూర్ కు బీఆర్ఎస్ నేత రాజారాం యాదవ్ సైతం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా బీఆర్ఎస్ టికెట్టు కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు..

ఎపిలో టిడిపి జోరు…
ఎపిలో అధికారంలో ఉన్న టిడిపి కూటమి ఎమ్మెల్సీ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌లైన వెంట‌నే రెండు గ్రాడ్యుయేట్ స్థానాల‌కు అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టించింది. ఉమ్మ‌డి ఉభ‌య‌గోదావరి జిల్లాల‌ అభ్య‌ర్దిగా పి. రాజ‌శేఖ‌ర్ ,కృష్ణా, గుంటూరు జిల్లాలో అభ్య‌ర్ధిగా ఆల‌పాటి రాజాను ఎంపిక చేసింది. ఇక శ్రీకాకుళం-విజ‌య‌న‌గ‌రం-విశాఖ‌ప‌ట్నం జిల్లాల‌ ఉపాధ్యాయ స్థానానికి అభ్యర్ధిని ఎంపిక చేయవ‌ల‌సి ఉంది.. ఇక వైసిపి ఇప్ప‌టి వ‌ర‌కు త‌మ అభ్య‌ర్ధులను ప్ర‌క‌టించ‌లేదు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *