మోదీపై వ్యాఖ్యలు..

మోదీపై వ్యాఖ్యలు..
కాంగ్రెస్‌పై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపాటు
శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ దిగజారిన రాజకీయ సంస్కృతికి ప్రతీక అని బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు విష్ణువర్ధన్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. విజయవాడలో విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, “దేశానికి నాయకత్వం వహిస్తున్న ప్రధానమంత్రిని ఉగ్రవాదితో పోల్చడం అత్యంత దురుద్దేశపూరితమైనది, ప్రజాస్వామ్యానికి అవమానం” అని పేర్కొన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని, వ్యక్తిగత దూషణలే వారి రాజకీయ అజెండాగా మారాయని విమర్శించారు.
గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసి తరువాత వెనక్కి తగ్గిన సందర్భాలు ఉన్నాయని గుర్తుచేస్తూ, ఇది కాంగ్రెస్ నాయకత్వంలోని అస్థిరతను స్పష్టంగా చూపిస్తోందన్నారు. “అధికారాన్ని కోల్పోయిన నిరాశలో కాంగ్రెస్ నేతలు మితిమీరిన వ్యాఖ్యలకు దిగుతున్నారు” అని విమర్శించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు చెప్పేందుకు స్పష్టమైన విధానాలు లేకపోవడంతోనే కాంగ్రెస్ వ్యక్తిగత దాడులకే పరిమితమైందని, ఇది వారి రాజకీయ దివాళా పరిస్థితిని బహిర్గతం చేస్తోందన్నారు.
అభివృద్ధి, పారదర్శకత, సమర్థ నాయకత్వంతోనే ప్రజలు బీజేపీకి మద్దతు ఇస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇదే ధోరణి కొనసాగితే కాంగ్రెస్ పార్టీని ప్రజలు మరింత కాలం అధికారానికి దూరంగా ఉంచడం ఖాయమని హెచ్చరించారు. వెంటనే కాంగ్రెస్ నాయకత్వం తమ వైఖరిని మార్చుకుని, గౌరవప్రదమైన రాజకీయ సంభాషణకు తిరిగి రావాలని, లేకపోతే ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోతుందని తీవ్రంగా వ్యాఖ్యానించారు.
