Kuppam | పరిశ్రమల ఒప్పందాలతో వ్యాప్తంగా కార్యక్రమాలు

Kuppam | పరిశ్రమల ఒప్పందాలతో వ్యాప్తంగా కార్యక్రమాలు
- రెండవ రోజు ముఖ్యమంత్రి కుప్పం పర్యటన
Kuppam | కుప్పం, ఆంధ్రప్రభ ; కుప్పం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండో రోజు పర్యటన విస్తృత కార్యక్రమాలతో కొనసాగనుంది. పేదల సంక్షేమం నుంచి మహిళల సాధికారత, పర్యావరణ పరిరక్షణ నుంచి పరిశ్రమల స్థాపన వరకు అనేక అంశాలను కవర్ చేస్తూ ఈ పర్యటన రూపుదిద్దుకుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ, డ్వాక్రా మహిళలకు భారీ ఎత్తున ఇ-సైకిళ్ల అందజేత, పారిశ్రామిక ఒప్పందాలు ఈ పర్యటనకు ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తున్నాయి.

గుడిపల్లె మండలం బెగిలపల్లె గ్రామంలో “పేదల సేవలో” కార్యక్రమంలో పాల్గొనే సీఎం స్వయంగా పింఛన్లను లబ్ధిదారులకు అందజేయనున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా ప్రజల గడపకు చేరుతున్నాయనే సందేశాన్ని ఈ కార్యక్రమం ద్వారా ఇవ్వనున్నారు. అనంతరం అదే ప్రాంతంలో డ్వాక్రా మహిళలకు 5,555 ఇ-సైకిళ్లను పంపిణీ చేయనున్నారు.

బెగిలపల్లె నుంచి శెట్టిపల్లె వరకు వేలాది ఇ-సైకిళ్లతో భారీ ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఒకేసారి ఇంత భారీ సంఖ్యలో ఇ-సైకిళ్ల ర్యాలీ నిర్వహించడం ద్వారా ప్రపంచ స్థాయి గుర్తింపు దక్కేలా కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ ర్యాలీ కేవలం ప్రదర్శన మాత్రమే కాకుండా పర్యావరణహిత రవాణాపై ప్రభుత్వ దృష్టిని ప్రతిబింబిస్తుంది.
అనంతరం కుప్పంలో ప్రజావేదిక కార్యక్రమంలో సీఎం పాల్గొని ప్రసంగించనున్నారు. సభ అనంతరం వివిధ పథకాల లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. “వన్ ఫ్యామిలీ – వన్ ఎంట్రప్రెన్యూర్” పథకం లబ్ధిదారులతో భేటీ అవుతారు. పీ4 కార్యక్రమం కింద బంగారు కుటుంబాలు, మార్గదర్శులతో కూడా సీఎం చర్చించనున్నారు.

కుప్పం పట్టణంలో సీఎన్జీ కాంపాక్టర్లను సీఎం ఆవిష్కరించనున్నారు. నెట్ జీరో లక్ష్యాలు, వ్యర్థ నిర్వహణపై ఐఐటీ కాన్పూర్ సమర్పించిన నివేదికను పరిశీలించనున్నారు. శాస్త్రీయ పద్ధతుల్లో మున్సిపల్ వ్యర్థాలను నిర్వహించే దిశగా ఇది కీలక అడుగుగా భావిస్తున్నారు.
సీఎం సమక్షంలో కుప్పంలో పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చిన ఏడు కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదరనున్నాయి. రూ. 675 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఈ ఒప్పందాలు ప్లాస్టిక్ ఉత్పత్తులు, గార్మెంట్స్ తయారీ, వుడ్ స్టోన్ ఉత్పత్తులు, ఇంటిగ్రేటెడ్ చికెన్ ప్రాసెసింగ్ ప్లాంట్, విద్యుత్ మరియు ఎలక్ట్రానిక్స్ తయారీ రంగాలకు చెందినవి. ఈ పెట్టుబడులు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలను పెంచనున్నాయని అధికారులు చెబుతున్నారు.

ప్రజావేదిక సభలో సీఎం మాట్లాడుతూ, “కుప్పంలో 5,555 సూపర్ ఇ-సైకిళ్లను మహిళలకు అందించాం. గతంలో ఉన్న రికార్డులను తుడిచిపెట్టి చరిత్ర సృష్టించాం. ఈ ఇ-సైకిళ్లు రాబోయే కాలంలో ఎంతో ఉపయోగపడతాయి. 60 కిలోమీటర్ల వరకు సులభంగా ప్రయాణించవచ్చు. ఇది కేవలం రవాణా సాధనం కాదు — ఆరోగ్యం, ఆదా, పర్యావరణ పరిరక్షణకు దోహదపడే సాధనం,” అని పేర్కొన్నారు.

మహిళలకు సమయం ఆదా అవుతుందని, కుటుంబ ఖర్చుల్లో నెలకు రూ.1,000 నుంచి రూ.1,500 వరకు ఆదా సాధ్యమవుతుందని సీఎం తెలిపారు. విద్యార్థులకు తక్కువ ఖర్చుతో సురక్షిత ప్రయాణం కలుగుతుందని చెప్పారు. మహిళల ఆత్మవిశ్వాసం పెరగడమే కాకుండా కాలుష్యం తగ్గించడంలో ఈ చర్య దోహదం చేస్తుందని పేర్కొన్నారు.
“ఇది కేవలం రికార్డు కాదు – కుప్పం అభివృద్ధిలో కొత్త ప్రయాణం. కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలతో ముందుకు వెళ్తేనే ఫలితాలు అందరికీ అందుతాయి. కాలుష్య రహిత కుప్పం నిర్మాణమే లక్ష్యం,” అని సీఎం స్పష్టం చేశారు. ఈ పర్యటనతో కుప్పం నియోజకవర్గంలో సంక్షేమం, సాధికారత, పర్యావరణ పరిరక్షణ, పారిశ్రామిక అభివృద్ధి అంశాలు ఒకే వేదికపై ప్రతిబింబించాయి.
