మల్లన్నగండి నుంచి సాగునీటి విడుదల..

  • విడుదల చేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి

చిలుపూర్, ఆంధ్రప్రభ ; చిలుపూర్, స్టేషన్ ఘనపూర్ మండలాల పరిధిలోని మల్లన్న గండి రిజర్వాయర్ కుడి కాలువ ద్వారా మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పంట కాలువలకు నీటి పారుదల శాఖ అధికారులు, రెండు మండలాల ప్రజా ప్రతినిధులు, రైతులతో కలిసి సాగు నీరు విడుదల చేశారు. ఈ సందర్బంగా రిజర్వాయర్ లోని గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి పసుపు కుంకుమలు సమర్పించారు. స్వయంగా కుడి కాలువ గేట్లు లేపి నీటిని విడుదల చేశారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుత కరువు పరిస్థితులలో దేవాదుల ఎత్తిపోతల పథకం ఉమ్మడి వరంగల్ జిల్లాకు వరప్రదాయనిగా మారిందని తెలిపారు. ధర్మసాగర్, ఘనపూర్, మల్లన్న గండి, అశ్వరావుపల్లి, నవాబ్ పేట తో పాటు బొమ్మకూరు, చిటకోడూరు రిజర్వాయర్ ద్వారా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాలకు సాధ్యమైనంత వరకు సాగు నీరు అందించే ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలోని ఏ ప్రాజెక్టు నుండి కూడా సాగు నీరు విడుదల చేయడం లేదని కేవలం దేవాదుల ప్రాజెక్ట్ నుండి మాత్రమే పంటలకు సాగు నీరు విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

నెల రోజుల నుండి ప్రతీ రోజు దేవాదుల మోటార్ల ద్వారా పంపింగ్ పరిశీలిస్తూ అధికారులతో సమన్వయం చేసుకుంటూ రిజర్వాయర్లలో నీటిని నింపడం వల్లే ప్రస్తుతం సాగు నీటి విడుదల సాధ్యం అయిందని అన్నారు. రిజర్వాయర్లలో 50శాతం వరకు నీటి నిలువలు ఉన్నాయని కావున ఆన్ అండ్ ఆఫ్ పద్దతిలో సాగు నీటి విడుదల చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. 15రోజుల పాటు నీటి విడుదల చేసి మరో 15రోజులు రిజర్వాయర్లలో నీటిని నింపడం జరుగుతుందని వెల్లడించారు.

పంట కాలువల ద్వారా వచ్చే నీటిని రైతులు పొదుపుగా వాడుకొని పంటలను కాపాడుకోవాలని సూచించారు. ఆరుతడి పంటలు, ఇప్పటికే నాట్లు పూర్తి చేసి సాగు చేసుకున్న వరి పొలాలకు మాత్రమే నీటి వినియోగించుకోవాలని కొత్తగా వరి నాట్లు వేసి ఇబ్బందులు పడవద్దని విజ్ఞప్తి చేశారు. కాలువల ద్వారా వచ్చే నీటిని నిరూపయోగం కాకుండా ప్రజా ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు సమన్వయం చేసుకొని కాలువల వెంట పర్యవేక్షించాలని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతీ ఎకరాకు సాగు నీరు అందించి పంటలను కాపాడటమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి, రాపోలు మధుసూదన్ రెడ్డి, బేతి జైపాల్ రెడ్డి, సింగిల్ విండో చైర్మెన్ నరెందర్ రెడ్డి, సర్పంచ్ లు సుజన, లక్ష్మి, చిల్పూర్, ఘనపూర్ మండలాల వివిధ గ్రామాల సర్పంచులు, నీటి పారుదల శాఖ అధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.