రోడ్డు భద్రతకు పోలీసుల వినూత్న చర్యలు

రోడ్డు భద్రతకు పోలీసుల వినూత్న చర్యలు

  • డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహణ

అచ్చంపేట, ఆంధ్రప్రభ ; రహదారి ప్రమాదాల నివారణలో భాగంగా అచ్చంపేట సబ్‌-డివిజన్ పోలీసులు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. “ఆరైవ్ అలైవ్” కార్యక్రమంలో భాగంగా గురువారం అచ్చంపేట పోలీస్ స్టేషన్‌లో డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. అచ్చంపేట సీఐ నాగరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాగర్‌కర్నూల్‌కు చెందిన కూచికుల్ల రామచంద్రారెడ్డి ఐ హాస్పిటల్, ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ వైద్య బృందం కంటి పరీక్షలు చేపట్టింది.

స్కూల్ బస్సులు, ఆటోలు, క్యాబ్‌లు, లారీలు తదితర వాహనాల డ్రైవర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని పరీక్షలు చేయించుకున్నారు. ఇట్టి పరీక్షలలో అవసరమైన వారికి ఉచిత కంటి పొర ఆపరేషన్ లతో పాటు ఉచిత కంటి అద్దాలను పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా సీఐ నాగరాజు మాట్లాడుతూ డ్రైవర్లకు స్పష్టమైన కంటి చూపు ఉండటం రహదారి భద్రతకు కీలకమని తెలిపారు. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ప్రాణాంతక ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు.

మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, వేగ పరిమితులను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అదేవిధంగా ఆటో, క్యాబ్, స్కూల్ బస్సుల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించరాదని, మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించినట్లయితే నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ద్విచక్ర వాహనాలపై త్రిబుల్ రైడింగ్ చేయరాదని, వాహనాలకు నెంబర్ ప్లేట్లు స్పష్టంగా ఉండాలని సూచించారు.

డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ బుక్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్ వంటి పత్రాలు తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని తెలిపారు. స్పీడ్ బ్రేకర్లు స్పష్టంగా కనిపించేలా ఆర్టీఏ, వాహన తనిఖీ అధికారులతో చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. ఉచిత కంటి పరీక్షలు నిర్వహించిన వైద్య బృందానికి పోలీసులు కృతజ్ఞతలు తెలిపారు. మొత్తం 150 మంది డ్రైవర్లు ఈ క్యాంపులో పాల్గొని కంటి పరీక్షలు చేయించుకోగా సైట్ ఉన్నవారికి ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఆప్తమాలజిస్ట్ జ్యోతి, సూపర్వైజర్ వెంకటయ్యతో పాటు ఎస్సైలు సద్దాం, రాజేందర్, అంజయ్య, హనుమంత్ రెడ్డి, శ్రీను, జయన్న తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply