బ్లేజ్‌వాడ ఎండల్లోనూ ఇంద్రకీలాద్రి పటిష్టత…

బ్లేజ్‌వాడ ఎండల్లోనూ ఇంద్రకీలాద్రి పటిష్టత…

ముమ్మరంగా సాగుతున్న ఎన్ ఐ ఆర్ ఎం శాస్త్రవేత్తల అధ్యయనం

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడ లోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన కొండ చరియల పటిష్టతపై శాస్త్రీయ అధ్యయనం చేయడానికి వచ్చిన బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ శాస్త్రవేత్తల బృందం తమ క్షేత్రస్థాయి పరిశోధనలను ముమ్మరం చేసింది. ఈ సాంకేతిక బృందం ఈ నెల 15వ తేదీ నుండి 19వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఇక్కడ సమగ్ర సర్వే నిర్వహించనుంది.

ఎండాలోనూ…

ప్రస్తుతం విజయవాడ ‘బ్లేజ్ వాడ’ను తలపిస్తూ అత్యధిక ఉష్ణోగ్రతలతో నిప్పులు చెరుగుతున్నప్పటికీ, భక్తుల భద్రతే ధ్యేయంగా శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో అకుంఠిత దీక్షతో పని చేస్తున్నారు. రెండవ రోజైన గురువారం కొండలైట్ రాతి స్వరూపంతో కూడిన ఇంద్రకీలాద్రిపై, హెచ్చు ఉష్ణోగ్రతల వల్ల రాళ్లలో కలిగే మార్పులను, వాటి పటుత్వాన్ని ఈ బృందం నిశితంగా పరిశీలిస్తోంది. జాతీయ రహదారి వెంట, ఘాట్ రోడ్ల వెంబడి బయటకు కనిపిస్తున్న కొండ రాళ్ల పొరల నుండి భూగర్భ సాంకేతిక భౌగోళిక నమూనాలను బృందం సేకరిస్తోంది. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం జరుగుతున్న ఈ సర్వేలో భాగంగా, అత్యాధునిక పరికరాల సహాయంతో రాళ్ల స్థితిగతులు, మట్టితో మిళితమైన ప్రాంతాలు, తరచుగా రాళ్లు జారిపడే ప్రదేశాలను శాస్త్రీయంగా

విశ్లేషిస్తున్నారు.

​భవిష్యత్ నిర్మాణాలకు మార్గదర్శి..

రాబోయే రోజుల్లో కొండపై నిర్మించనున్న ‘పాశుపాతాలయం’ 2వ ఘాట్ రోడ్డు వంటి బృహత్తర ప్రణాళికలకు గల అనుకూల పరిస్థితులపై ఈ బృందం ప్రత్యేకంగా అధ్యయనం చేస్తోంది. ఈ సర్వే నివేదిక ఇంద్రకీలాద్రి భవిష్యత్ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చివేయనుంది. ఈ అధ్యయనం ఆధారంగా చేపట్టే రక్షణ చర్యల వల్ల భక్తులకు కొండ చరియల ముప్పు నుండి శాశ్వత విముక్తి లభించడమే కాకుండా, దేవస్థాన మాస్టర్ ప్లాన్‌ను పకడ్బందీగా అమలు చేయడానికి మార్గం సుగమం అవుతుంది.

అత్యాధునిక సాంకేతికత, శాస్త్రీయ దృక్పథంతో రూపొందించే ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థ నివేదికతో ఇంద్రకీలాద్రి మరింత సురక్షితమైన, సుందరమైన ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లనుందని, భవిష్యత్ కార్యాచరణకు రాష్ట్ర ప్రభుత్వం,స్థానిక ప్రజా ప్రతినిధుల చొరవతో ముందడుగు పడిందని ఆలయ కార్యనిర్వహణాధికారి వికె శీనానాయక్ అన్నారు. శాస్త్రవేత్తలు ఇంద్రకీలాద్రి పై సర్వే సందర్బంగా గమనిస్తున్న విషయాలు పై ప్రతీ రోజు అధ్యయనం చేస్తున్నామని, ఈ సర్వే నివేదిక ఆలయ భవిష్యత్ అభివృద్ధికి ఒక సమగ్ర కరదీపిక గా ఉపయోగపడుతుందని ఈవో పేర్కొన్నారు.

Leave a Reply