ఇందిరమ్మ ఇళ్ల పథకం.. నత్తనడకలో సొంతింటి కల

ఇందిరమ్మ ఇళ్ల పథకం.. నత్తనడకలో సొంతింటి కల

మొదటి విడత లక్ష్యం చేరని నిర్మాణాలు
అసంపూర్తిగా వేలాది ఇళ్ల పనులు
వివిధ జిల్లాల్లో నిర్మాణ పురోగతి తక్కువ
కార్మికుల కొరతతో వేగం తగ్గిన పనులు
అర్హులకు అందని గృహాలు – పెరుగుతున్న అసంతృప్తి


ఆంధ్రప్రభ న్యూస్ నెటవర్క్ : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు గత సంవత్సరం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నత్తనడకన సాగుతున్నట్లు గ్రౌండ్ రిపోర్టును బట్టి తెలుస్తోంది.

ఖమ్మం జిల్లాలో మొదటి విడతగా మొత్తం 16,243 ఇళ్లు మంజూరు కాగా, ఇప్పటివరకు కేవలం 9,046 ఇళ్లు మాత్రమే పూర్తయినట్లు అధికారుల గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఇంకా 7,197 ఇళ్లు వివిధ దశల్లో ఉండగా, వాటిలో ముగ్గులు పోయకుండా నేటికీ ప్రారంభం కాని ఇళ్లు 553 ఉన్నాయి. బేస్ మట్టం స్థాయిలో 1157 ఇళ్లు, స్లాబ్ లెవల్ పూర్తయిన వాటిలో 3109 ఉన్నాయి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొదటి విడతలో 17,988 ఇళ్లు మంజూరు కాగా, సగం వరకు పూర్తి కాలేదు. జిల్లాలో వేల సంఖ్యలో ముగ్గులు, బేసమట్టం దశలలో ఉండడం, అరకొరగా నిర్మాణాలు సాగుతున్నాయి.

ఇందిరమ్మ ఇళ్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలు చెల్లించాల్సి ఉండగా, కేంద్ర ప్రభుత్వ వాటా చెల్లింపుల పేరుతో చివరి విడత బిల్లులు చెల్లించడాన్ని నిలిపివేయడంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఖమ్మం జిల్లాలో మొదటి విడత పూర్తయిన ఇళ్లకు చివరి విడత నగదు చెల్లింపులు రూ.లక్ష నుంచి రూ.1.60 లక్షల వరకు ఒక్కో ఇంటికి చెల్లించకుండా ప్రభుత్వం నిలిపివేయడంతో స్లాబ్లు పూర్తి చేసుకున్న 3109 ఇళ్లు ముందుకు సాగడంలేదు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొదటి దశలో 17,988 ఇళ్లు మంజూరు కాగా, సగానికి పైగా ఇళ్లు పూర్తి కాకుండానే ఉన్నాయి. ఇల్లందు మండలంలో 934 మంజూరు కాగా, 127 ఇండ్లు మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన 774 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. అశ్వారావుపేట మండలంలో 1093 మంజూరు కాగా, 262 మాత్రమే పూర్తయ్యాయి.

ఖమ్మం జిల్లాలో నేటికీ ముగ్గులు పోసి ప్రారంభించని ఇండ్లు 553, గోడలు కట్టి స్లాబ్ కోసం ఉన్న ఇండ్లు 874 ఉన్నాయి. గత నెల వరకూ ప్రారంభం కాని మొదటి విడత ఇళ్లు 1504 ఇతరులకు కేటాయించి ఇంకా ముగ్గులు పోయిస్తున్నారు. కొన్ని చోట్ల ప్రభుత్వం కేటాయిస్తున్న రూ.5 లక్షల పథకం ఇండ్ల నిర్మాణానికి సరిపోవడం లేదని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. పెరిగిన సిమెంట్, ఇటుక, ఐరన్, కూలీ రేట్ల నేపధ్యంలో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని కనీసం రూ.7 నుండి 8 లక్షలకు పెంచాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

ఖమ్మం జిల్లాలో మొదటి విడత ఇందిరమ్మ ఇండ్ల లక్ష్యాన్ని నెరవేర్చేందుకు నిర్మాణాలు వేగవంతం చేయిస్తున్నట్లు ఖమ్మం జిల్లా హౌజింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్ పేర్కొన్నారు.

మంజూరైనవి 16 వేలు.. నిర్మించినవి 3200

రంగారెడ్డి జిల్లాలో మొదటి విడతలో ఆరు నియోజకవర్గాలకు 16,036 ఇళ్లు మంజూరు చేయగా ఇందులో 3200 ఇళ్లు పూర్తి చేసి గృహ ప్రవేశాలు చేసుకున్నారు. ఆరు వేలకు పైగానే స్లాబులు పూర్తి చేశారు. మిగతావి వివిధ దశల్లో కొనసాగుతున్నాయి.

జిల్లాలో 3200 ఇళ్లు నిర్మాణాలు పూర్తి చేశారు. 5271 ఇళ్లు స్లాబ్లు పూర్తి అయ్యాయి. 1167 రూట్లెవెల్, 1931 బేస్మెంట్, 2255 ఇళ్లు మార్కింగ్ దశలో ఉన్నాయి. 2168 ఇళ్లు ఇంకా ప్రారంభం కాలేదు.

వికారాబాద్ జిల్లాలో 12,863 ఇళ్లు మంజూరు కాగా 9వేల ఇళ్లు పూర్తి చేశారు. ఇందులో చాలా ఇళ్లకు గృహ ప్రవేశాలు కూడా పూర్తి చేశారు.

వేధిస్తున్న కార్మికుల కొరత

ఉమ్మడి మెదక్ జిల్లాలో సుతారి మేస్త్రీలు, కూలీలు, ఎలక్ట్రిషియన్లు, ప్లంబర్లు, టైల్స్ వర్కర్ల కొరతతో అనేక ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలు ఆశించిన వేగంతో పూర్తికావడం లేదు.

సంగారెడ్డి జిల్లాలో మొత్తం 12,823 ఇళ్లు మంజూరు కాగా 8,840 ఇళ్లకు మార్కింగ్ పూర్తయింది. ఇప్పటివరకు 7,347 ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.

సిద్ధిపేట జిల్లాలో 10,923 ఇందిరమ్మ ఇళ్లు మంజూరవగా 2,064 ఇళ్లు పూర్తయ్యాయి. మెదక్ జిల్లాలో 9,098 ఇళ్లు మంజూరవగా 7,148 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి.

అర్హులకు దక్కని గృహాలు

ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మొదటి విడతలో ప్రతి నియోజకవర్గానికి 3500 చొప్పున ఇళ్లు మంజూరు చేశారు. మొత్తం 43,607 ఇళ్లు మంజూరయ్యాయి.

వరంగల్ జిల్లాలో 1793 ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ములుగు జిల్లాలో 1115, జనగామ జిల్లాలో 1009, భూపాలపల్లి జిల్లాలో 547 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి.

మహబూబాబాద్ జిల్లాలో 2,905 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. హనుమకొండ జిల్లాలో 2524 ఇళ్లు పూర్తికాగా, కొన్ని చోట్ల గృహప్రవేశాలు జరిగాయి.

మొదటి విడత పూర్తిగా పూర్తికాకుండానే రెండో విడత ఇళ్ల మంజూరు చేయడం పట్ల అర్హుల ఎంపికపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Leave a Reply