IND vs ENG | ఇంగ్లాండ్ గ‌డ్డ‌పై భార‌త్ హిస్టరీ… బర్మింగ్‌హామ్ లో చారిత్రాత్మక విజయం !

భార‌త క్రికెట్ జ‌ట్టు ఇంగ్లాండ్ గ‌డ్డ‌పై చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. బర్మింగ్‌హామ్ వేదికపై తొలిసారిగా భారత్ గెలుపొందుతూ దశాబ్దాల రికార్డుకు పుల్‌స్టాప్ పెట్టింది.

1967 నుండి ఈ మైదానంలో ఆడిన 8 టెస్టుల్లో భారత్ ఒక్క టెస్టు కూడా గెలవలేదు. 7 ఓటములు, 1 డ్రా తర్వాత… ఈసారి గిల్ నేతృత్వంలోని భారత్ విజ‌యం సాధించింది. 608 పరుగుల ఛేదనలో ఇంగ్లాండ్ ను 271 ప‌రుగుల‌కే కుప్ప‌కూల్చింది భార‌త్.

దీంతో ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమ్‌ఇండియా 336 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును చిత్తుచేసి చారిత్రాత్మక విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల ఆండర్సన్-టెండుల్కర్ ట్రోఫీ సిరీస్‌ను ప్రస్తుతం 1-1తో సమం చేసింది.

ఈ విజయానికి ప్రధాన కారణం భారత బౌలింగ్ యూనిట్ ప్రదర్శన. భారత బౌలర్లు ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్‌ను తొలి ఇన్నింగ్స్ నుంచే ఒత్తిడిలోకి నెట్టి మ్యాచ్ అంతటా ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. ఇక కెప్టెన్ శుభ్మన్ గిల్ నాయకత్వం, ప్లానింగ్, డెసిషన్ మేకింగ్‌ కూడా విజయంలో కీలక పాత్ర పోషించాయి.

ఈ గెలుపుతో భారత జట్టు తన విశ్వాసాన్ని పెంపొందించుకోడమే కాకుండా, ఇంగ్లాండ్ గడ్డపై తమ ప్రతిభను మరోసారి రుజువు చేసింది. బర్మింగ్‌హామ్‌లో సాధించిన ఈ ఘన విజయం భారత క్రికెట్ చరిత్రలో ఒక గుర్తుండిపోయే అధ్యాయంగా నిలవనుంది.

బ్యాటింగ్, బౌలింగ్ తో ఆల్ రౌండ్ ప్రదర్శన

ఈ విజయంతో శుభ్‌మన్‌ గిల్‌ కెప్టెన్సీలో తొలి టెస్టు గెలుపుని నమోదు చేశాడు. మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా భారీ స్కోరు నమోదు చేయడంలో కెప్టెన్ గిల్‌ పాత్ర విశేషం. 387 బంతుల్లో 30 ఫోర్లు, 3 సిక్సర్లతో 269 పరుగులు చేసిన గిల్‌, తన కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన అందించాడు. ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ (87), ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (89), వాషింగ్టన్ సుందర్‌ (42) కూడా మెరుగైన పాత్ర పోషించగా, భారత జట్టు 587 పరుగులకు ఆలౌటైంది.

బదులుగా బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌కు ఒక్క దశలో బ్రూక్ – జేమీ స్మిత్ భాగస్వామ్యం తప్ప పెద్దగా ఎదురు తిరగలేకపోయింది. భారత బౌలర్లలో హైదరాబాదీ పేసర్ మహ్మద్‌ సిరాజ్‌ 6 వికెట్లు తీయగా, ఆకాశ్‌ దీప్‌ 4 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లండ్‌ 407 పరుగులకు పరిమితమైంది.

రెండో ఇన్నింగ్స్‌లోనూ గిల్‌ మళ్లీ తళుక్కున మెరిశాడు. ఈసారి 162 బంతుల్లో 13 ఫోర్లు, 8 సిక్సర్లతో 161 పరుగులు చేసి మరో శతకం తన ఖాతాలో వేసుకున్నాడు. అతనికి తోడు కేఎల్‌ రాహుల్‌ (55), రిషబ్‌ పంత్‌ (65), రవీంద్ర జడేజా (69 నాటౌట్‌) అర్ధ శతకాలతో రాణించడంతో భారత్‌ 427/6 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్‌ చేసి ఆతిథ్య ఇంగ్లండ్‌కు 608 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది.

అంత పెద్ద టార్గెట్‌ ముందు ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ పూర్తిగా తడబాటుకు గురైంది. తొలి నుంచే వికెట్లు కోల్పోయిన స్టోక్స్‌ సేన, ఆకాశ్‌ దీప్‌ (6/99) బౌలింగ్‌ ధాటికి నిలవలేకపోయింది. మిగతా బౌలర్లు కూడా తోడ్పాటుగా ఒక్కొక్క వికెట్‌ తీసి ఇంగ్లండ్‌ 271 పరుగులకే ఆలౌట్‌ చేయడంలో సహకరించారు.

ఈ మ్యాచ్‌లో 430 పరుగులు చేసిన శుభ్‌మన్‌ గిల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. బౌలింగ్‌లో సిరాజ్ ( మొత్తం 7 వికెట్లు), ఆకాష్‌ దీప్‌ (మొత్తం 10 వికెట్లు) గొప్ప పాత్ర పోషించారు. సిరీస్ ప్రస్తుతం 1-1 సమంగా నిలిచింది. ఇక మూడో టెస్టు జూలై 10 నుంచి లార్డ్స్‌లో ప్రారంభం కానుంది.

Leave a Reply