Grand Trunk Railway Line : 130 ఏళ్ల చరిత్రకు తెర

Grand Trunk Railway Line : 130 ఏళ్ల చరిత్రకు తెర

  • తొలి రైల్వే బ్రిడ్జి ఇక అదృశ్యం
  • కూల్చివేత‌కు రంగం సిద్ధం
  • బ్రిటిష‌ర్ల వంతెనకు గుడ్‌బై
  • బెజవాడ చరిత్రలో మ‌రో మ‌లుపు
  • గ్రాండ్ ట్రంక్ లైన్‌కు పునాది ఈ బ్రిడ్జి
  • రైల్వే చ‌రిత్ర‌లో క‌నుమ‌రుగు
  • చారిత్రక మాన‌వ నిర్మిత వంతెన
  • ఇక చరిత్ర పుటల్లో ఫోటోలు ల‌భ్యం

( ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో)

Grand Trunk Railway Line

ఇటు తూర్పున బంగాఖాతం.. ఆ ప‌క్క‌న అరేబియా సాగ‌ర తీరంలో ప‌శ్చిమ క‌నుమ‌లు., ఉత్త‌రాన అందాల క‌శ్మీరం.. ద‌క్షిణాన త్రి సాగ‌ర సంగమం క‌న్యాకుమారి సోయ‌గాలు.. . ఈశాన్యంలో భానుడి తొలి వెలుగులు పంచే అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌.. వాయువ్యంలో అరావ‌ళీ ప‌ర్వ‌త‌శ్రేణి.. వావ్‌.. అఖండ భార‌తావ‌ని అంద‌చందాల‌న్నీ చూడాలంటే… అటు నుంచి ఇటు.. ఇటు నుంచి ఎటో వెళ్లాలంటే.. ఆ ద‌రి నుంచి ఈ ద‌రికి .. ఈ ద‌రి నుంచి మ‌రో ద‌రికి వెళ్లే బహుదూర‌పు బాట‌సారి ..బెజ‌వాడ క‌న‌క దుర్గ‌మ్మకు దండం ప‌ట్టాలి. బిర‌బిర‌ల ప‌రుగులు తీసే కృష్ఱ‌మ్మ ఒడిని కాసుల‌తో నింపాలి. అంత‌టి గొప్ప దృశ్యం .. ఎక్క‌డో కాదు.. నూత‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తి చెంత‌లోని ఉంది. అదే న్యూఢిల్లీ నుంచి చెన్నైకి వెళ్లే గ్రాండ్ ట్రంక్ రైల్వేలైన్ లో దేశంలోని 28 మేటీ రైల్వే జంక్ష‌న్ ల్లో ఒక‌టి .. బెజ‌వాడ రైల్వే స్టేష‌న్‌.. అర్ధరాత్రి లేదు. అప‌రాత్రి లేదు. 24 గంట‌లూ.. కూ చుక్ చుక్ రైలు పాట వినాల్సిందే..

Grand Trunk Railway Line

ఔను రోజుకు 250 కి పైగా ప్యాసింజ‌ర్ రైళ్లు.. ఎక్స్ ప్రెస్ లు, సూప‌ర్ ఫాస్టు రైళ్లు వేలాది మంది ప్ర‌యాణికుల‌తో రాకపోకలు సాగిస్తాయి. విజయవాడ స్టేషన్ దేశంలోని ఉత్తర, పశ్చిమ , తూర్పు ప్రాంతాలను అనుసంధానించే కీలక కేంద్రం. ఇక్కడి నుండి ఢిల్లీ వంటి ఉత్తర భారత నగరాలకు నిత్యం అనేక రైళ్లు నడుస్తాయి. ప్రతిరోజూ సుమారు 150 నుండి 170 వరకు గూడ్స్ రైళ్లు నడుస్తాయి.వీటి వార్షిక ఆదాయం ఎంతో తెలుసా.. ₹5,836.61 కోట్లు.ఇందులో సరుకు రవాణా ₹4,239.74 కోట్లు, ప్రయాణికుల నుంచి వ‌చ్చే ఆదాయం ₹1,386.14 కోట్లు. ఇంత గొప్ప రైల్వే స్టేష‌న్ గా అవ‌త‌రించ‌టానిక పునాది తెలుసా?

Grand Trunk Railway Line : తరతరాల చరితకు సాక్ష్యం

Grand Trunk Railway Line

కృష్ణానదిపై బ్రిటిష్ కాలం నాటి చారిత్రక రైల్వే వంతెన త్వరలో చరిత్ర పుటల్లోకి వెళ్లనుంది. సుమారు 130 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ వంతెన ఒకప్పుడు బెజవాడ రైల్వే జంక్షన్ అభివృద్ధికి పునాది వేసిన కీలక నిర్మాణంగా నిలిచింది. ప్రస్తుతం వినియోగంలో లేకపోవడంతో దీనిని పూర్తిగా తొలగించేందుకు చర్యలు ప్రారంభమవుతున్నాయి. ఈ వంతెనను సాధారణంగా కృష్ణా రైల్వే బ్రిడ్జి అని పిలుస్తారు. బ్రిటిష్ పాలనలో దక్షిణ భారత రైల్వే రవాణా విస్తరణలో ఇది ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. విజయవాడ ను ను దేశంలోని ప్రధాన నగరాలతో అనుసంధానించడంలో ఈ వంతెన కీలక పాత్ర పోషించింది.

Grand Trunk Railway Line : 1893లో నిర్మాణం ప్రారంభం

కృష్ణా నదిపై ఉన్న ఈ తొలి వంతెన నిర్మాణం 1893 మార్చి 17న ప్రారంభమైంది. అప్పట్లో మీటర్ గేజ్ రైల్వే మార్గం కోసం దీనిని నిర్మించారు. అనంతరం 1897లో మద్రాస్,బెజవాడ రైల్వే మార్గం అభివృద్ధి నేపథ్యంలో దీనిని మిక్స్‌డ్ గేజ్ వ్యవస్థకు అనుగుణంగా మార్చారు. ఆ కాలంలో ఈ నిర్మాణం ఇంజనీరింగ్ ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది. బ్రిటిష్ కాలంలో దక్షిణ భారత రైల్వే రవాణా అభివృద్ధికి ఈ వంతెన ప్రధాన పాత్ర పోషించింది. ముఖ్యంగా చెన్నై,న్యూ ఢిల్లీ గ్రాండ్ ట్రంక్ మార్గంలో రైలు రాకపోకలకు ఇది కీలక మార్గంగా పనిచేసింది. తర్వాత కాలంలో కొత్త వంతెనలు నిర్మించడంతో పాత వంతెన ప్రాముఖ్యత క్రమంగా తగ్గింది.

Grand Trunk Railway Line : కొత్త బ్రిడ్జిలు వచ్చినా..

Grand Trunk Railway Line

ఈ బ్రిడ్జ్ తోపాటు 1980వ దశకంలో కృష్ణానదిపై ఆధునిక రైల్వే వంతెనలు నిర్మించడంతో రైళ్ల రాకపోకలు వాటిపైకి మళ్లించబడ్డాయి. దీంతో పాత వంతెన వినియోగం తగ్గింది. చివరికి 1989 వరకు మాత్రమే ఈ వంతెనపై రైలు రాకపోకలు కొనసాగాయి. అనంతరం 1993లో అధికారికంగా డీకమిషన్ చేశారు. ఈ వంతెన నిర్మాణ పనులను పర్యవేక్షించేందుకు అప్పట్లో ప్రస్తుతం గాంధీ హిల్ గా పిలిచే గుట్టపై చీఫ్ ఇంజనీర్‌కు ప్రత్యేక బంగ్లా ఏర్పాటు చేశారు. కొద్ది దశాబ్దాల క్రితం వరకు అక్కడ పర్యవేక్షణ ఇంజనీర్ నివాసం కూడా ఉండేది. ఈ వంతెన నిర్మాణంలో ఆ కాలంలోనే అత్యంత బలమైన లోహాలను వినియోగించారు. ప్రతి స్తంభం భారీ ఇంజనీరింగ్ సాంకేతికతతో నిర్మించబడింది. ఒక పిల్లర్‌ను కూల్చేందుకు సుమారు 15 రోజుల సమయం పట్టే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. వంతెన రెండు వైపులా ఎత్తైన వాచ్ టవర్లు కూడా ఉండేవి.

Grand Trunk Railway Line : వారసత్వ పరిరక్షణపై చర్చ

Grand Trunk Railway Line

చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ఈ వంతెనను పూర్తిగా తొలగించడంపై పలు వర్గాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. పురాతన వారసత్వ కట్టడాలను పరిరక్షించాల్సిన అవసరం ఉందని చరిత్రకారులు, వారసత్వ పరిరక్షణ సంఘాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ఒకప్పుడు విజయవాడ నగర గుర్తింపుగా నిలిచిన ఈ వంతెన కూల్చివేతతో నగర చరిత్రలో ఒక అధ్యాయం ముగియబోతోందని స్థానికులు పేర్కొంటున్నారు.

Grand Trunk Railway Line

ALSO READ : Kondapalli Fort Dargah | కొండపల్లి ఖిల్లాకు దారి న‌హీ

Leave a Reply