ఐడీఓసీలో కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ..

  • కార్యాలయాల్లో పరిశుభ్రత, సిబ్బంది హాజరుపై ఆరా.. నిర్లక్ష్యం చేస్తే చర్యలు

నాగర్‌కర్నూల్‌ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ)లో ప్రభుత్వ కార్యాలయాల పనితీరు, నిర్వహణ, పరిశుభ్రత, సిబ్బంది హాజరు తదితర అంశాలను పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్‌ హేమంత్‌ కేశవ్‌ పాటీల్‌ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేపట్టారు. అదనపు కలెక్టర్‌ బి.చెన్నయ్యతో కలిసి ఐడీఓసీ భవనంలోని వివిధ అంతస్తుల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను విస్తృతంగా సందర్శించి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించారు.

కార్యాలయాల నిర్వహణలో ఎక్కడైనా లోపాలు, నిర్లక్ష్యం కనిపిస్తే వాటిని వెంటనే సరిదిద్దుకోవాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాలు కేవలం పరిపాలనా కార్యకలాపాలు నిర్వహించే ప్రదేశాలు మాత్రమే కాదని, వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చే కేంద్రాలని అన్నారు. అందువల్ల కార్యాలయాలు పరిశుభ్రంగా, క్రమబద్ధంగా, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండేలా చూడాల్సిన బాధ్యత ప్రతి శాఖాధికారిపై ఉందని సూచించారు.

ప్రజలకు అందించే సేవల్లో జాప్యం లేకుండా సిబ్బంది సమయపాలనతో విధులకు హాజరై బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆదేశించారు. పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, ప్రతి శాఖాధికారి తన కార్యాలయ నిర్వహణపై నిరంతరం పర్యవేక్షణ చేయాలని స్పష్టం చేశారు.

కలెక్టర్‌ తనిఖీలను ఐడీఓసీ గ్రౌండ్‌ఫ్లోర్‌లోని ప్రధాన సమావేశ మందిరం నుంచి ప్రారంభించారు. అనంతరం అక్కడ ఉన్న ఎస్‌బీఐ బ్యాంకు, నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ), ఎన్‌ఐసీ వీడియో కాన్ఫరెన్స్‌ విభాగాలను పరిశీలించారు. వీడియో కాన్ఫరెన్స్‌కు సంబంధించిన సాంకేతిక సదుపాయాలు, పరికరాల నిర్వహణ, అవసరమైన మౌలిక వసతులపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

భూగర్భ జిల్లా వనరుల విభాగం, మహిళా శిశు సంక్షేమ శాఖ, కలెక్టరేట్‌లోని వివిధ విభాగాల సూపరింటెండెంట్ల కార్యాలయాలను కూడా సందర్శించారు. ఆయా కార్యాలయాల్లో సిబ్బంది హాజరు, ఫైళ్ల నిర్వహణ, కార్యాలయ పరిసరాల పరిశుభ్రత, పాత సామగ్రి తదితర అంశాలను పరిశీలించారు.

కలెక్టరేట్‌ రికార్డు గది, స్టోర్‌రూమ్‌లను ప్రత్యేకంగా తనిఖీ చేశారు. రికార్డులు, సామగ్రిని ఎలా భద్రపరుస్తున్నారు? ప్రస్తుతం వినియోగంలో ఉన్నవి ఏవి? వినియోగంలో లేనివి ఏవి? అనే అంశాలపై అధికారులను ప్రశ్నించారు. పాత రికార్డుల భద్రత, నిర్వహణపై సూచనలు చేశారు.

మొదటి అంతస్తులోని గ్రామీణ అభివృద్ధి శాఖ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్‌.. సహాయ సంచాలకులు భూ కొలతల కార్యాలయం, పంచాయతీ అధికారి కార్యాలయం, జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం, పరిశ్రమల శాఖ, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌, ఎక్సైజ్‌ శాఖ, జిల్లా పౌరసరఫరాల శాఖ కార్యాలయాలను పరిశీలించారు.

హౌసింగ్‌, పే అండ్‌ అకౌంట్స్‌, ట్రెజరీ, జిల్లా వ్యవసాయ శాఖ, గిరిజన అభివృద్ధి, సహకార శాఖ కార్యాలయాలను కూడా తనిఖీ చేశారు. ఆయా శాఖలకు వచ్చే ప్రజలకు అందుతున్న సేవలు, సిబ్బంది అందుబాటులో ఉండే విధానం, కార్యాలయాల్లో పరిశుభ్రత తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

రెండో అంతస్తులోని షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ, షెడ్యూల్డ్‌ కులాల కార్పొరేషన్‌, ఉద్యాన శాఖ, మత్స్యశాఖ కార్యాలయాలను పరిశీలించారు. జిల్లా మేనేజర్‌ పౌరసరఫరాల సంస్థ, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ, ముఖ్య ప్రణాళిక శాఖ కార్యాలయాలను కూడా సందర్శించారు. రోడ్లు భవనాల శాఖ, ఆడిట్‌ కార్యాలయం, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయాలను తనిఖీ చేశారు.

రెండో అంతస్తులోని సమావేశ మందిరాలు, సర్వర్‌ రూమ్‌లు, ఎలక్ట్రికల్‌ రూమ్‌లను కూడా పరిశీలించిన కలెక్టర్‌.. వాటి నిర్వహణ, భద్రత, పరిశుభ్రతపై అధికారులను ఆరా తీశారు. సర్వర్‌, ఎలక్ట్రికల్‌ రూమ్‌లలో పరికరాల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

జిల్లా ట్రెజరీ కార్యాలయాన్ని సందర్శించిన సమయంలో కార్యాలయ ఆవరణలోని ఓ ప్రాంతంలో అపరిశుభ్ర పరిస్థితులను కలెక్టర్‌ గమనించారు. పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్యం లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రవళిక చిన్నారిపై కలెక్టర్‌ ఆరా

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయాన్ని సందర్శించిన సమయంలో కలెక్టర్‌ మానవీయ కోణంలో స్పందించారు. బిజినపల్లి మండలం మంగనూరు గ్రామానికి చెందిన ప్రవళిక సుమారు 15 రోజుల క్రితం గాంధీ ఆసుపత్రిలో మృతి చెందిన విషయం తెలుసుకున్న ఆయన.. ఆమెకు జన్మించిన చిన్నారి గురించి ఆరా తీశారు.

ప్రస్తుతం చిన్నారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? వైద్య సేవలు అందుతున్నాయా? తల్లి మృతి అనంతరం కుటుంబానికి ఎలాంటి సహాయం అందుతోంది? తదితర వివరాలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ)ను అడిగి తెలుసుకున్నారు. ఈ తనిఖీ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ బి.చెన్నయ్య, డీఆర్వో పాండు, ఏవో చంద్రశేఖర్‌తో పాటు వివిధ శాఖల అధికారులు, కార్యాలయాల సిబ్బంది పాల్గొన్నారు.