Eetha Teaser | గూస్‌బంప్స్ తెప్పిస్తున్న ‘ఈథా’ టీజర్!

Eetha Teaser | గూస్‌బంప్స్ తెప్పిస్తున్న ‘ఈథా’ టీజర్!

Eetha Teaser | ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్‌: ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అంతా బయోపిక్‌ల బాట పడుతోంది. అప్పటి నటులు, కళాకారుల జీవితాలను దర్శకులు తెరపై కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నారు. కాగా, ఇప్పుడు బాలీవుడ్‌లో మరో బయోపిక్ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అదే ‘ఈథా’. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ తాజాగా విడుదలైంది.

ప్రస్తుతం బాలీవుడ్‌లో అందరి చూపు ఈ సినిమాపైనే ఉంది. ఎందుకంటే, ఇటీవలే థియేటర్లలో ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం సర్ప్రైజ్‌గా విడుదల చేసింది. ఇందులో శ్రద్ధా కపూర్ లుక్, ఆమె మేకోవర్ ట్రాన్స్‌ఫార్మేషన్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఆమాంతం పెరిగిపోయాయి.

‘ఈథా’ అనే సినిమా మహారాష్ట్రకు చెందిన ప్రసిద్ధ ‘తమాషా’, ‘లావణి’ జానపద కళాకారిణి వితాబాయి నారాయణగాంకర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్. 1940 నుంచి 1990ల మధ్య కాలంలో ఒక కళాకారిణిగా జానపద రంగానికి ఆమె చేసిన సేవలు, ఆమె ఎదుర్కొన్న వ్యక్తిగత పోరాటాల చుట్టూ ఈ కథ సాగుతుంది.

రొటీన్ గ్లామరస్ పాత్రలకు భిన్నంగా శ్రద్ధా కపూర్ ఇందులో జానపద నృత్యకారిణిగా (వితాబాయి నారాయణగాంకర్ పాత్రలో) కనిపించిన తీరు అద్భుతంగా ఉందంటూ ప్రశంసలు దక్కుతున్నాయి. ఆమె మేకప్, కాస్ట్యూమ్స్, బాడీ లాంగ్వేజ్ ఈ పాత్రకు పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యాయి. ముఖ్యంగా గర్భవతిగా ఉన్న సమయంలోనే వేదికపై డ్యాన్స్ చేస్తూ, నొప్పులు రావడంతో స్టేజ్ వెనక్కి వెళ్లి ప్రసవించే సీన్.. అందులో శ్రద్ధా పర్ఫార్మెన్స్ అద్భుతమని చెప్పాలి.

దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ మార్క్ మేకింగ్, 1940-50ల నాటి కాలానికి తగినట్టుగా ప్రొడక్షన్ డిజైన్, విజువల్స్ ప్లాన్ చేసిన విధానం టీజర్‌లో గ్రాండ్‌గా కనిపిస్తోంది. ఈ టీజర్ చూసిన సినిమా విశ్లేషకులు, నెటిజన్లు.. శ్రద్ధా కపూర్‌కు ఈ సినిమాతో ఖచ్చితంగా జాతీయ అవార్డు వచ్చే అవకాశం ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాలో కీలక పాత్రల్లో రణదీప్ హుడా, మహ్మద్ జీషన్ అయ్యూబ్, నానా పటేకర్, సిద్ధార్థ్ జాదవ్ వంటి ప్రముఖ నటులు నటిస్తున్నారు. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం 2026 ఆగస్టు 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.