12న తెలంగాణ జన సమితి 4వ ప్లీనరీ.

12న తెలంగాణ జన సమితి 4వ ప్లీనరీ.

టీజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపగాని శంకర్ రావు.

జూలూరుపాడు, ఆంధ్రప్రభ : ఈ నెల 12వ తేదీన తెలంగాణ జన సమితి 4వ ప్లీనరీ సమావేశం హైద్రాబాద్ నగరంలో నిర్వహిస్తున్నట్లు టీజేఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జీ గోపగాని శంకర్ రావు తెలిపారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో శంకర్ రావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గోపగాని మాట్లాడుతూ సీమాంధ్ర ఆధిపత్య శక్తుల దోపిడీకి వ్యతిరేకంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో సకల జనులు ఏకమై ఉద్యమించారన్నారు.

అమరుల బలిదానాల సాక్షిగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను బలహీన పరచి రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం నియంతృత్వ పాలన సాగించిందని విమర్శించారు. ఉద్యమ ఆకాంక్షల అభివృద్ధి నమూనాను రూపొందించకుండా సీమాంధ్ర పాలన విధానాన్నే కొనసాగించిందని శంకర్ రావు ఆరోపించారు. ప్రభుత్వాన్ని వ్యక్తిగత అస్తిలా భావించిన ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించే స్వరాలను అహంకారపూరితంగా వ్యవహరించారన్నారు.

రాజ్యాంగ విలువలను నిలబెట్టేందుకు తెలంగాణ ఉద్యమ రధసారధి ఆచార్య కోదండరాం నాయకత్వంలో ఏప్రిల్ 29 2018న తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించిందన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ అభివృద్ధిలో వాటా కల్పించాలని,ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యవస్థ కావాలనే లక్ష్యం కోసం టీజేఎస్ పార్టీ పనిచేస్తుందని గోపగాని అన్నారు.

కేసీఆర్ అప్రజాస్వామిక పాలనను నిరసిస్తూ విశాల ఐక్య ప్రజా ఉద్యమ నిర్మాణంలో తెలంగాణ జన సమితి కీలక పాత్ర పోషించిందన్నారు. బలవంతపు భూసేకరణ, నిరుద్యోగం, బీసీ రిజర్వేషన్ల పెంపు,అందరికి విద్యా,వైద్యం, ఆదివాసీ సమస్యలు, కృష్ణా, గోదావరి జలాల్లో న్యాయమైన వాటా, విభజన హామీలు అమలు, రైతులు, చేతివృత్తుల వారికి ఆదాయ భద్రత, సింగరేణి పరిరక్షణ, ఫీజు రీయంబర్స్మెంట్,స్థానికులకు ప్రైవేట్ రంగంలో అవకాశం కల్పించాలని టీజేఎస్ పార్టీ నిరంతర పోరాటం కొనసాగించిందన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో జనసమితికి కొంత నష్టం జరిగిన కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినట్లు వెల్లడించారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన,ఆర్థిక, రాజకీయ,సామాజిక,సమానత్వం,ప్రజాస్వామ్య పరిరక్షణ ఎన్నికల సంస్కరణలపై విస్తృత చర్చ ఈ ప్లీనరీ సమావేశం చర్చిస్తామన్నారు.డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ చదువు,బోధించు, సమీకరించు,పోరాడు నినాదం స్పూర్తితో ముందుకు పోతామన్నారు.

తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయ శంకర్ స్పూర్తితో ప్రజలను సంఘటితం చేస్తామని శంకర్ రావు చెప్పారు. గతాన్ని సమీక్షించి, భవిష్యత్ కార్యాచరణ రూపొందించేందుకు మే 12న హైద్రాబాద్ నగరంలోని నెక్లెస్ రోడ్డు, జల విహారలో జన సమితి నాలుగవ రాష్ట్ర ప్లీనరీ నిర్వహిస్తున్నామన్నారు. టీజేఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై ప్లీనరీని విజయవంతం చేయాలని గోపగాని శంకర్ రావు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఖమ్మం జిల్లా టీజేఎస్ కోఆర్డినేటర్లు రాజేందర్ నాయక్, మాదాసు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply