ODI Rankings | గిల్ టాప్.. రోహిత్ అప్ – కోహ్లీ డౌన్ !

కెప్టెన్ రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ ట్రోఫీ చివరి మ్యాచ్‌లో భారత ఆటగాళ్ళు అద్భుతంగా రాణించి విజయం సాధించారు. కాగా, న్యూజిలాండ్ తో జ‌రిగిన ఫైనల్ మ్యాచ్లో చెల‌రేగిన హిట్ మ్యాన్… వ‌న్డే ర్యాంకింగ్స్ లో త‌న స్థానాన్ని మెరుగుప‌రుచుకున్నాడు.

బ్యాటర్ల ర్యాంకింగ్స్..

ఫైనల్ మ్యాచ్‌లో 76 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీల‌క పాత్ర పోషించిన కెప్టెన్ రోహిత్.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. కాగా, ఆ మ్యాచ్ ఫలితంగా, కెప్టెన్ రోహిత్ 756 పాయింట్లతో వన్డే ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు ఎగబాకి టాప్-3లోకి ప్రవేశించాడు.

మ‌రోవైపు టీమిండియా యువ బ్యాట‌ర్, వైస్ కెప్టెన్ శుభమన్ గిల్ 784 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. పాకిస్తాన్ బ్యాటర్ బాబర్ అజామ్ 770 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా, ఫైనల్లో నిరాశపరిచిన విరాట్ కోహ్లీ 736 పాయింట్లతో ఒక ర్యాంక్ దిగజారి నాల్గవ స్థానానికి చేరుకున్నాడు.

ఫైనల్‌ మ్యాచ్ తో పాటు మిగతా మ్యాచుల్లోనూ కీలకంగా రాణించిన కేఎల్ రాహుల్ 638 పాయింట్లతో అనూహ్యంగా కిందకి దిగజారిపోయాడు. ప్రస్తుతం 16వ ర్యాంకులో కొనసాగుతున్నాడు.

బౌలర్లు, ఆల్ రౌండర్లు…

బౌలర్ల విభాగంలో టీమిండియా స్పిన్ బౌల‌ర్ కుల్దీప్ యాదవ్ మూడు స్థానాలు ఎగబాకి 650 పాయింట్లతో మూడో స్థానానికి చేరుకున్నాడు. రవీంద్ర జడేజా మూడు స్థానాలు మెరుగుపరుచుకుని 616 పాయింట్లతో పదో స్థానానికి చేరుకున్నాడు. ఇక శ్రీలంక స్పిన్నర్ మహేష్ తీక్షణ 680 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ 657 పాయింట్లతో ఆరు స్థానాలు ఎగబాకి రెండవ స్థానానికి చేరుకున్నాడు.

ఆల్‌రౌండర్ల జాబితాలోనూ రవీంద్ర జడేజా టాప్‌ -10లో కొనసాగుతున్నాడు. 220 పాయింట్లతో పదో ర్యాంకులో నిలిచాడు. అఫ్గాన్‌ ప్లేయర్ అజ్మతుల్లా ఒమర్జాయ్‌ టాప్ పొజిషన్ లో ఉన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *