మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్‌కు ఘన సన్మానం..

ఊట్కూర్, ఆంధ్రప్రభ : అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని పెద్దజట్రం గ్రామాన్ని శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా పెద్దజట్రం సర్పంచ్ వాకిటి వెంకటేష్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు.ఈ సందర్భంగా గువ్వల బాలరాజ్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, నాయకులు సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటి పరిష్కారానికి అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. గ్రామాల్లో తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, విద్య, వైద్యం వంటి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న సర్పంచ్ వాకిటి వెంకటేష్‌ను ఆయన అభినందించారు.

గ్రామ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం పెంచాలని, ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేయాలని సూచించారు. అనంతరం సర్పంచ్ వాకిటి వెంకటేష్ మాట్లాడుతూ గువ్వల బాలరాజ్ గ్రామానికి రావడం సంతోషంగా ఉందన్నారు. ఆయనకు ఘనంగా సన్మానం చేయడం తమకు గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి కిరణ్ కుమార్, వార్డు సభ్యులు సోమేశ్వర్ రెడ్డి, బిజెపి నాయకులు శంకరప్ప, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.