విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలి: డిటిడిఓ అంబాజీ జాదవ్

జైనూర్‌, ఆంధ్రప్రభ : విద్యార్థులకు మెరుగైన విద్య అందించడంతో పాటు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని ఆసిఫాబాద్‌ డీటీడీఓ అంబాజీ యాదవ్‌ అన్నారు. శుక్రవారం కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా జైనూర్‌ మండలంలోని భూషిమెట్ట బాలికల గురుకుల కళాశాలను ఆయన సందర్శించారు.

ఈ సందర్భంగా కళాశాలలో విద్యార్థులకు అందుతున్న విద్యాబోధన, మౌలిక వసతులు, భోజన వసతి సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం ప్రిన్సిపాల్‌ తక్షశిలతో మాట్లాడుతూ విద్యార్థులకు నిర్ణయించిన మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు.

అనంతరం సిర్పూర్‌ (యు) మండలంలోని పంగిడి బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాల రికార్డులను పరిశీలించడంతో పాటు ఉపాధ్యాయుల హాజరు శాతాన్ని తెలుసుకున్నారు. విద్యార్థులకు అందుతున్న బోధన, భోజన వసతి సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థులకు మెరుగైన విద్య అందిస్తూ, మెనూ ప్రకారం భోజన వసతి కల్పించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి సూచించారు. పాఠశాలలోని ఇతర వసతులు, సౌకర్యాలపై ఏటీడీఓ శ్రీనివాస్‌, హెచ్‌ఎం, ఉపాధ్యాయులతో చర్చించారు.

ఈ కార్యక్రమంలో జైనూర్‌ ఏటీడీఓ శ్రీనివాస్‌, భూషిమెట్ట గురుకుల కళాశాల ప్రిన్సిపాల్‌ తక్షశిల, పంగిడి ప్రధానోపాధ్యాయుడు భగవంతరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.