బీర్కూర్‌లో సైబర్ మోసం

బీర్కూర్‌లో సైబర్ మోసం

-వాట్సాప్ లింక్ క్లిక్ చేసి రూ.95 వేలు కోల్పోయిన యువకుడు
-1930కు ఫిర్యాదు.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు

బీర్కూర్ (డోంగ్లీ), ఆంధ్రప్రభ:

బీర్కూర్ గ్రామానికి చెందిన ఓ యువకుడు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి రూ.95 వేల నగదును కోల్పోయాడు. వాట్సాప్‌లో వచ్చిన ఆర్టీవో చలాన్ లింక్‌ను నమ్మి వ్యక్తిగత వివరాలు నమోదు చేయడంతో ఈ మోసానికి గురైనట్లు తెలిసింది. గ్రామానికి చెందిన మజార్ అనే యువకుడు బీర్కూర్‌లో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. మే 2న ఓ వాట్సాప్ గ్రూపులో ఆర్టీవో చలాన్‌కు సంబంధించిన లింక్ రావడంతో దానిని ఓపెన్ చేశాడు. అనంతరం లింక్‌లో కోరిన వివరాలను నమోదు చేశాడు.

జూన్ 3న తన బ్యాంకు ఖాతాలో రూ.1 లక్ష జమ చేసిన మజార్‌కు, జూన్ 6 సాయంత్రం ఖాతా నుంచి ఆరు దఫాలుగా నగదు డెబిట్ అయినట్లు సందేశాలు వచ్చాయి. మొత్తం రూ.95 వేల నగదును సైబర్ నేరగాళ్లు కాజేసినట్లు గుర్తించాడు. డబ్బు మాయం అయిన విషయం తెలుసుకున్న బాధితుడు వెంటనే బీర్కూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పాటు జాతీయ సైబర్ హెల్ప్‌లైన్ 1930కు కూడా సమాచారం అందించాడు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ప్రజలు తెలియని లింక్‌లను క్లిక్ చేయకుండా, వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు.

Leave a Reply