పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
భీంగల్ మండలం సర్పంచుల ఫోరం అధ్యక్షులు అరిగేల జనార్దన్
భీంగల్ రూరల్, ఆంధ్రప్రభ : పిల్లలను పోలియో వ్యాధి నుంచి సంపూర్ణంగా రక్షించేందుకు నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని భీంగల్ మండలం సర్పంచుల ఫోరం అధ్యక్షులు, పిప్రి గ్రామ సర్పంచ్ అరిగేల జనార్దన్ పిలుపునిచ్చారు. ఆదివారం భీంగల్ మండలం పిప్రి గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి, ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కల మందు వేయించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించడం తల్లిదండ్రుల బాధ్యత అని అన్నారు. గ్రామంలో ఒక్క చిన్నారి కూడా ఈ కార్యక్రమానికి దూరం కాకుండా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ సిబ్బంది, ఆరోగ్య శాఖ సిబ్బంది, గ్రామ నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు కూడా తమ చిన్నారులను పోలియో కేంద్రాలకు తీసుకువచ్చి చుక్కల మందు వేయించాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.
