సీఎం హామీ.. కలెక్టర్ చేతుల మీదుగా ఈ-ఆటో పంపిణీ

సీఎం హామీ.. కలెక్టర్ చేతుల మీదుగా ఈ-ఆటో పంపిణీ
- రూ.3.52 లక్షల విలువైన వాహనం అందజేత
- మెప్మా పథకాలతో పట్టణ పేదలకు ఆర్థిక సాధికారత
- స్వయం ఉపాధికి ప్రభుత్వం ప్రోత్సాహం: కలెక్టర్
తిరుపతి ప్రతినిధి, ఆంధ్రప్రభ: నాయుడుపేటకు చెందిన లబ్ధిదారుడు సురేంద్రకు రూ.3.52 లక్షల విలువైన ఈ-ఆటోను గురువారం స్థానిక కలెక్టరేట్‌లో మెప్మా ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ స్వయం ఉపాధి అవకాశాల కల్పనకు కట్టుబడి పనిచేస్తోందన్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పించి వారి జీవనోపాధిని మెరుగుపరచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. మార్చి 30న నాయుడుపేటలో నిర్వహించిన టిడ్కో గృహప్రవేశ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు, మెప్మా ఆధ్వర్యంలో ఈ ఈ-ఆటోను లబ్ధిదారునికి అందజేయడం జరిగిందన్నారు. “ఇంటికొక్క పారిశ్రామికవేత్త” లక్ష్యంతో ప్రభుత్వం పలు సంక్షేమ, ఉపాధి పథకాలను అమలు చేస్తోందని తెలిపారు.
ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని, మెప్మా ద్వారా పట్టణ పేదలకు ఉపాధి అవకాశాలు, ఆర్థిక సాధికారత కల్పిస్తున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని లబ్ధిదారులకు సూచించారు. ఈ-ఆటోను అందుకున్న సురేంద్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, కలెక్టర్ వెంకటేశ్వర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆటో ద్వారా తన కుటుంబానికి స్థిరమైన ఆదాయం సమకూరుతుందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట ఆర్డీవో దేవేందర్ రెడ్డి, మెప్మా పీడీ జాల ఎఫ్రాయిమ్, నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ ఫజిలుల్లా, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
