పేదల కాలనీల్లో వసతులు కల్పించాలి..

పేదల కాలనీల్లో వసతులు కల్పించాలి..

రెడ్డిగూడెంలో పక్కాగృహాలు మంజూరు చేయాలి
శాసన సభలో మైలవరం ఎమ్మెల్యే వసంత విజ్ఞప్తి

ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : పేదలు నివసిస్తున్న కాలనీల్లో తక్షణమే మౌలిక వసతులు, కనీస సదుపాయాలు కల్పించాలని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఏపీ శాసన సభ సమావేశాల్లో ఎమ్మెల్యే వసంత బుధవారం మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో లక్షలాది ఇంటిపట్టాలు ఇచ్చి గొప్పలు చెప్పుకున్నారన్నారు. కానీ అప్పటి కాలనీల్లో ఇళ్లు నిర్మించుకున్న వారు చాలా అవస్థలు పడుతున్నారన్నారు. మైలవరం నియోజకవర్గంలో 69 కాలనీలు ఏర్పాటు చేసి, దాదాపు 16,700 ప్లాట్లు కేటాయించగా కేవలం 2,000లోపు గృహ నిర్మాణాలు సంపూర్ణంగా పూర్తి చేశారన్నారు. ఇబ్రహీంపట్నంలోని గాజులపేట, కొండపల్లి (ఈలప్రోలు), జి.కొండూరు, మైలవరంలోని పూరగుట్ట ప్రాంతాల్లో లే అవుట్లు ఏర్పాటు చేశారన్నారు.

కాలనీల్లో చాలా చోట్ల రహదారులు, విద్యుత్ సౌకర్యం, డ్రెయినేజీ వ్యవస్థ, తాగునీటి సదుపాయం కూడా లేవన్నారు. దీనివల్ల మిగిలిన వారు ఆయా కాలనీల్లో ఇళ్లు నిర్మించుకోవడానికి ముందుకు రావడం లేదన్నారు. పేదల అవస్థలను ఏడాది క్రితం ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, హౌసింగ్ అధికారులతో కలసి స్వయంగా పరిశీలించినట్లు స్పష్టం చేశారు. ముఖ్యంగా వర్షాకాలంలో ఆయా కాలనీల్లో బురద వల్ల అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొందన్నారు. ట్రాక్టర్లు, టిప్పర్లు తదితర వాహనాలు లోపలికి వెళ్లే అవకాశం లేదన్నారు. రెడ్డిగూడెం మండలంలో 1,634 మందికి ఇంటిపట్టాలు మంజూరు చేశామన్నారు. ఈ మండలం రూరల్ ఏరియాలో ఉండటం వల్ల ఒక్క పక్కాగృహం కూడా మంజూరు చేయలేదన్నారు.

రెడ్డిగూడెంలో 400కి పైబడి ప్లాట్లు ఉన్న లే అవుట్ లో కేవలం విద్యుత్, నీటి సదుపాయం కల్పించి, పక్కాగృహాలు మంజూరు చేస్తే ఇళ్లు నిర్మించుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. గత ప్రభుత్వం ఇల్లు ఇవ్వడం తప్పితే ఆ ఇంట్లో గౌరవంగా జీవించే పరిస్థితులు కల్పించలేదన్నారు. కొత్తగా ఇళ్లస్థలాలు ఇచ్చే లోపు ఆయా కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలని కోరారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సమస్య కాబట్టి ప్రభుత్వం దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. హౌసింగ్ కాలనీలను అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే వసంత కోరారు.

Leave a Reply