సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణలో సి.ఎస్., డి.ఓ.లదే కీలక బాధ్యత

సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణలో సి.ఎస్., డి.ఓ.లదే కీలక బాధ్యత

సీసీ కెమెరాల నిఘాలో పరీక్షల నిర్వహణ
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు – డీఐఈఓ రవికుమార్

నిజామాబాద్ స్పోర్ట్స్, ఆంద్ర‌ప్ర‌భ : అడ్వాన్స్ సప్లిమెంటరీ ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణలో చీఫ్ సూపరింటెండెంట్లు (సి.ఎస్.), డిపార్ట్మెంటల్ అధికారులు (డి.ఓ.) కీలక పాత్ర పోషించాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఇంటర్ బోర్డు కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ఆదివారం నిజామాబాద్ బాలుర (ఖిల్లా) జూనియర్ కళాశాలలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, కస్టోడియన్లు, అసిస్టెంట్ చీఫ్ సూపరింటెండెంట్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో మొత్తం 39 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ నెల 13 నుంచి 19 వరకు నిర్వహించనున్న ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు ఇంటర్ బోర్డు కమిషనర్, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించిన అధికారులపై ఇంటర్ బోర్డు కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలు తప్పనిసరిగా పనిచేసేలా చూడాలని, ప్రశ్నపత్రాల బండిళ్లను సీసీ కెమెరాల సమక్షంలోనే తెరవాలని ఆదేశించారు.
పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతులు వెంటనే కల్పించాలని సూచించిన రవికుమార్, సెల్‌ఫోన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షా కేంద్రాల్లో అనుమతించరాదన్నారు. సి.ఎస్., డి.ఓ.లు కూడా పరీక్షల సమయంలో తమ మొబైల్ ఫోన్లను పోలీస్ కస్టడీలో ఉంచాలని పేర్కొన్నారు.
పరీక్షల నిర్వహణకు ముందు ఇన్విజిలేటర్ల సమావేశం నిర్వహించి నియమ నిబంధనలు వివరించాలని సూచించారు. ప్రతిరోజూ ఫ్లయింగ్ స్క్వాడ్లు, సిట్టింగ్ స్క్వాడ్లు, ఇంటర్ బోర్డు బృందాలతో పాటు జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు అన్ని కేంద్రాలను తనిఖీ చేస్తారని తెలిపారు. మొదటి సంవత్సరం పరీక్షలు ఉదయం, రెండో సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం నిర్వహించనున్నట్లు విస్తృత ప్రచారం చేయాలని అధికారులను ఆదేశించారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత ఐదు నిమిషాల వరకు మాత్రమే విద్యార్థులను కేంద్రంలోకి అనుమతిస్తామని తెలిపారు. విద్యార్థులను పరీక్షా హాల్లోకి పంపే ముందు క్షుణ్ణంగా తనిఖీ చేసే బాధ్యత సి.ఎస్., డి.ఓ.లదేనని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో రెవెన్యూ, విద్య, విద్యుత్, ఆర్టీసీ, ఆరోగ్య, పోస్టల్, పోలీస్ శాఖల అధికారులతో ఇప్పటికే సమన్వయ సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణకు ముందు, పరీక్ష సమయంలో, అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలను పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు నుస్రత్ జహాన్, రజియా సుల్తానా, ఖిల్లా బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఖాలిక్, బల్క్ అధికారి చిన్నయ్య వివరించారు.
సమావేశంలో పరీక్షల నిర్వహణ కమిటీ అధికారులు, బల్క్ అధికారి చిన్నయ్య, బాలుర (ఖిల్లా) జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఖాలిక్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply