WATER| చలికి తోడు చన్నీటి స్నానం..

WATER| పాలకుర్తి, ఆంధ్రప్రభ : మండలంలో చలికాలం తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో జయ్యారం ఎస్సీ వసతి గృహంలో చదువుతున్న 48 మంది విద్యార్థుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. హాస్టల్‌లో వేడి నీటి సదుపాయం లేకపోవడంతో చిన్నారులు తెల్లవారుజామున గడ్డకట్టేంత చల్లని నీటితోనే స్నానం చేయాల్సి వస్తోంది. చలి తీవ్రతకు వణికిపోతున్నా, చదువు కోసం ఈ చిన్నారులు భరించక తప్పని పరిస్థితి నెలకొంది.
హాస్టల్‌లో బ్రీజర్లు లేవు
జయ్యారం హాస్టల్‌లో బ్రీజర్లు లేకపోవడంతో బోర్‌వెల్ నీటినే విద్యార్థులు వాడాల్సి వస్తోంది. చలికాలంలో ఈ నీరు మరింత చల్లబడుతుండడంతో స్నానం చేయడం చిన్నారులకు కష్టకరంగా మారింది. ఉదయపు ఏర్పాట్లన్నీ కూడా చలితో ఇబ్బందికరంగా మారుతున్నాయని విద్యార్థులు తెలిపారు. కొందరు చలిని తట్టుకోలేక స్నానం చేయకుండానే స్కూల్‌కు వెళ్లే పరిస్థితి ఏర్పడుతోంది.
క్షేత్రస్థాయిలో పరిస్థితి దారుణం
ప్రభుత్వం వసతి గృహాల్లో కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు కల్పిస్తున్నామని ప్రకటిస్తున్నా, జయ్యారం ఎస్సీ హాస్టల్ పరిస్థితి మాత్రం దీనికి విరుద్ధంగా ఉందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చలికాలం ఇప్పుడే మొదలైందని వచ్చే డిసెంబర్–జనవరిలో మరింత తీవ్రత పెరిగితే విద్యార్థులు ఎలా ఎదుర్కొంటారో స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
అధికారులు పట్టించుకోవాలి
విద్యార్థుల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా హాస్టల్‌లో వెంటనే బ్రీజర్లు ఏర్పాటు చేసి వేడి నీటి సదుపాయం కల్పించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఒక్క ఆదేశంతోనే బ్రీజర్లు ఏర్పాటు అయ్యే అవకాశం ఉందని పిల్లల తల్లిదండ్రులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చల్లని నీటితో వణికిపోతున్న ఈ 48 చిన్నారుల సమస్యను అధికారులు సీరియస్‌గా తీసుకొని వెంటనే చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
