Public Examinations | ఇంటర్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు..

Public Examinations | ఇంటర్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు..
- సమన్వయ శాఖల అధికారులు ప్రణాళికతో పనిచేయాలి..
- ఎక్కడా ఏ చిన్న పొరపాటుకూ తావులేకుండా చూడాలి..
- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ..
Public Examinations | ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : ఎన్‌టీఆర్ జిల్లాలో ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల(Public examinations)ను (ఐపీఈ-2026) విజయవంతంగా నిర్వహించేందుకు సమన్వయ శాఖల అధికారులు ప్రణాళికాయుతంగా వ్యవహరిస్తూ.. పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు.
ఇవాళ కలెక్టరేట్ శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్‌లో కలెక్టర్ లక్ష్మీశ.. ఇంటర్ పబ్లిక్ పరీక్షల నిర్వహణపై సమన్వయ శాఖల అధికారుల సమావేశం నిర్వహించారు. ఇంటర్మీడియెట్ విద్య, పాఠశాల విద్య, రెవెన్యూ, పోలీస్, ప్రజా రవాణా, వైద్య ఆరోగ్యం, విద్యుత్, పోస్టల్, సమాచార, పౌర సంబంధాలు తదితర శాఖల అధికారులు హాజరైన ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ… ఇంటర్మీడియెట్ వొకేషనల్ ప్రాక్టికల్(vocational practical) పరీక్షలు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 10 వరకు, జనరల్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 1 నుంచి పదో తేదీ వరకు జరుగుతాయన్నారు.
అదేవిధంగా అత్యంత కీలకమైన థియరీ పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24వ తేదీ వరకు 98 కేంద్రాల్లో జరుగుతాయని వివరించారు.

థియరీ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నట్లు తెలిపారు. 36,734 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు, 39,534 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు మొత్తం 76,268 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు వివరించారు. జిల్లా స్ట్రాంగ్ రూమ్, 17 స్టోరేజ్ పాయింట్ల(storage points) భద్రతపై ప్రత్యేకంగా దృష్టిసారించాల్సిన అవసరముందన్నారు.
పరీక్ష పత్రాలను స్టోరేజ్ పాయింట్ల నుంచి పరీక్షా కేంద్రాలకు తరలింపు మొదలు ప్రతి దశలోనూ అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. రిసెప్షన్, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నిర్వహణ, బందోబస్తు ఏర్పాటు, భద్రతా చర్యలు, సీసీ కెమెరాల నిఘా విషయంలో పోలీసు శాఖతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
అన్ని పరీక్షా కేంద్రాల్లోనూ నో సెల్ ఫోన్ జోన్‌గా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రాక్టికల్, థియరీ పరీక్షలకు నాలుగు చొప్పున ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, థియరీ పరీక్షలకు మూడు సిటింగ్ స్క్వాడ్(sitting squad)ల ఏర్పాటుకు అవసరమైన అధికారులు, సిబ్బందిని సిద్ధం చేయాలన్నారు.
పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరుకునేలా ఆర్‌టీసీ ప్రత్యేక బస్సులు నడపాలని సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు, విద్యుత్ సరఫరాకు ఇబ్బంది లేకుండా చూడాలని, పారిశుద్ధ్యంపైనా దృష్టిసారించాలని సూచించారు.
పరీక్ష కేంద్రాల వద్ద వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, ప్రాథమిక చికిత్స కిట్లను అందుబాటులో ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖ(Health Department) అధికారులకు సూచించారు. సమావేశంలో జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి బి.ప్రభాకరరావు, డీఆర్‌వో ఎం.లక్ష్మీనరసింహం, డీఈసీ సభ్యులు జి.ఝాన్సీ, ఎన్.వెంకటరావు, జి.వెంకటరమణ, కె.విష్ణుకాంత్, డీఈవో ఎల్.చంద్రకళ, డీఎంహెచ్‌వో డా.ఎం.సుహాసిని, ఏపీఎస్ఆర్‌టీసీ అధికారి టి.సాయిచరణ్‌తేజ, పోస్టల్, విద్యుత్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
