Committee meeting | పారదర్శకంగా అనుమతులివ్వాలి…

Committee meeting | పారదర్శకంగా అనుమతులివ్వాలి…
- జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్
Committee meeting | చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు పారదర్శకంగా, వేగంగా అనుమతులు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం చిత్తూరు కలెక్టరేట్లో జిల్లా పరిశ్రమలు–ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. పరిశ్రమల స్థాపన ద్వారా జిల్లాలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన కోసం అవసరమైన నైపుణ్య శిక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూ కేటాయింపులు త్వరితగతిన మంజూరు చేస్తామని తెలిపారు. ప్రధానమంత్రి ఉపాధి సృష్టి పథకం కింద వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించి రుణాలు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. మంజూరైన యూనిట్లు త్వరగా స్థాపించబడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కుప్పం, పలమనేరు, వీకోట ప్రాంతాల్లో పాడి పరిశ్రమలు, గ్రానైట్ పరిశ్రమలను ప్రోత్సహించాలని తెలిపారు. నగిరిలో ఎక్కువగా ఉన్న పవర్లూమ్ పరిశ్రమలను మరింత అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు. పూతలపట్టు ధనరాజుపల్లిలో పరిశ్రమలకు అవసరమైన విద్యుత్ సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.

పరిశ్రమల స్థాపనకు సంబంధించిన అనుమతులు, లైసెన్సులు నిర్ణీత కాలపరిమితిలో ఆలస్యం లేకుండా మంజూరు చేయాలని అన్ని శాఖలను కలెక్టర్ ఆదేశించారు. పరిశ్రమల క్లస్టర్లలో విద్యుత్ అంతరాయాలపై నివేదిక సమర్పించాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. అలాగే పరిశ్రమల ప్రాంతాల్లో స్థానిక పరిపాలనా సంస్థల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ, విద్యుత్ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారులతో పాటు పరిశ్రమల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
