Deputy CM | డిప్యూటీ సీఎం సార్.. ఆదుకోండి

Deputy CM | డిప్యూటీ సీఎం సార్.. ఆదుకోండి
- చేతి వృత్తి, కుల సంఘాల నాయకులు వేడుకోలు
- నంద్యాల ప్రాజెక్టు టైగర్ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయ ముట్టడి
- కర్నూలు- చిత్తూరు జాతీయ రహదారిపై బైఠాయింపు
- కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్, వాహనదారుల అవస్థలు
Deputy CM | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నల్లమల అడవిలోని వస్తువులను అమ్ముకుంటూ జీవనాధారం పొందుతున్న మేదరి, ఎరుకలి, యానాది తదితర కులవృత్తిదారులపై అటవీ శాఖ అధికారులు దాడులు చేస్తూ కడుపు కొడుతున్నారని ఆందోళనకు దిగారు. ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ వెంటనే జోక్యం చేసుకొని ఆదుకోవాలని జాతీయ రహదారిపై ఇవాళ ధర్నా చేపట్టారు. అటవీ అధికారుల దాడులను అడ్డుకొని రక్షణ కల్పించాలని కోరారు.
జిల్లా కేంద్రానికి కిలోమీటర్ పరిధిలో ఉన్న రైతు నగరం వద్ద ఉన్న నంద్యాల జిల్లా టైగర్ ప్రాజెక్టు డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయాన్ని పలు కుల, వృత్తి సంఘాల నాయకులు వందలాదిగా తరలివచ్చి ముట్టడించారు. పొట్టకూటి కోసం మేదర, ఎరుకలి, యానాది, చెంచు గిరిజనుల కుల వృత్తిగా కుటుంబానికి అవసరమయ్యే వెదురు చాటాలు, గంపలు, విసనకారాలు, చంద్రికలు అల్లుకుని జీవనం సాగించే మాపై అటవీశాఖ అధికారులు నిరంతరం దాడులు చేస్తున్నారని, మా కుల వృత్తులను అంతం చేయాలని అటవీ అధికారులు పంతం కట్టుకుని ఉన్నారని ఆరోపించారు.

మహానంది మండలంలోని ఆర్‌ఎస్ గాజులపల్లి, గాజులపల్లి, మహానంది, అబ్బిపురం, ఆత్మకూరు మండలానికి చెందిన ఎరుకలి, మేదరి సంఘాల నాయకులు, బండి ఆత్మకూరు మండలం సంతజూటూరు, నారాయణపురం, సింగవరం, పెద్ద దేవలపురం, ఈర్నపాడు, జీసీ పాలెం మేదరి, ఎరుకలి, చెంచు కుల సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున నంద్యాల జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ప్రాజెక్టు టైగర్ కార్యాలయాన్ని ముట్టడించారు. అటవీ అధికారి స్పందించకపోవడంతో కర్నూలు- చిత్తూరు జాతీయ రహదారిపై గంట సేపు రాస్తారోకో చేయడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.
ఫారెస్ట్ అధికారులు అక్రమంగా తీసుకుని వెళ్ళిన బొలెరో వాహనాల విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని శిరివెళ్ల మండలం, పచ్చర్ల చెంచుగూడేనికి చెందిన చెంచులం, ఎప్పటి నుంచో పచ్చర్ల చెంచుగూడెంలో ఉంటూ అడవి మీద ఆధారపడి జీవిస్తున్నామన్నారు. మాకు పచ్చర్లలో చెంచులక్ష్మి బ్యాంబు కో-ఆపరేటివ్ సొసైటీ ఉందని, ఇప్పుడు అటవీ అధికారులు మూసివేశారని, మేము అడవి నుండి దోమతెర కట్టెలు, ముల్లు కర్రలు, పట్టుడు కర్రలు, పొరక కర్రలు, తెచ్చుకొని మనిషికి రెండు మోపులు ప్రకారం బయట ప్రాంతంలో అమ్ముకొని జీవనం సాగిస్తున్నామన్నారు.

అటవీ అధికారుల దాడులవల్ల మేము అడవి నుంచి ఏమి తెచ్చుకోలేక జీవనం కష్టంగా ఉందని, మేము తెచ్చుకున్న ముల్లకర్రలు (బాంబూస్), దోమతెర కర్రలు (బాంబూస్), పొరక కర్రలు (బాంబూస్) లను తెచ్చుకుంటుంటే సంవత్సరం క్రితం 5 బొలెరో వాహనాలను పట్టుకున్నారన్నారు.గతంలో ఫారెస్ట్ ఆఫీసర్స్ పట్టుకున్న కట్టెలకు, బండ్లకు కాంపౌండు ఫీజు వేసి వదిలిపెట్టేవారన్నారు. ఈ మధ్య కాలంలో కూడా కొన్ని బండ్లకు కాంపౌండు చలానా వేసి వదిలిపెట్టినారని, మా బండ్లను మాత్రం వదిలి పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నిరసనకు అధికార టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు కేసీ కెనాల్ ప్రాజెక్టు చైర్మన్ బన్నూరు రామలింగారెడ్డి, బండి ఆత్మకూరు టీడీపీ సీనియర్ నాయకులు కంచర్ల సురేష్ రెడ్డి, మహానంది మండల బీజేపీ నాయకులు నాగేశ్వరరావు, ఆర్‌ఎస్ గాజులపల్లి సర్పంచ్ అస్లాం బాషా, గాజులపల్లి టీడీపీ నాయకురాలు శశికళ, పచ్చర్ల చెంచు లక్ష్మి కో -ఆపరేటివ్ సోసైటీ అధ్యక్షులు సి. జమ్మన్న, సొసైటీ సీపి పుల్లయ్య, సభ్యులు ఎం. వెంకటేశ్వర్లు, కె. వెంకటరమణ, తదితరులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. నంద్యాల తాలూకా సీఐ ఈశ్వరయ్య, ట్రాఫిక్ సీఐ చాంద్ బాషా, టూ టౌన్ ఎస్ ఐ సురేష్ ఆధ్వర్యంలో అటవీ శాఖ ఫీల్డ్ డైరెక్టర్ కార్యాలయం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.
