GGH | జిజిహెచ్ కు నిధుల వెల్లువ..

GGH | జిజిహెచ్ కు నిధుల వెల్లువ..

  • కేంద్ర మంత్రి హ‌ర్దీప్ సింగ్ తో ఎంపీ కేశినేని భేటీ…
  • సీఎస్ఆర్ నిధులు ఇప్పించాల‌ని విజ్ఞ‌ప్తి…
  • సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి

ఆంధ్రప్రభ విజయవాడ : విజయవాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ కృషితో విజ‌య‌వాడ ప్ర‌భుత్వ జ‌న‌ర‌ల్ ఆసుప‌త్రి (GGH) రూపురేఖ‌లు మార‌నున్నాయి. విజ‌య‌వాడ జీజీహెచ్ కు త్వ‌ర‌లో కార్డియాలజీ, ఆఫ్తాల్మాలజీ, రేడియాలజీ వంటి విభాగాలకు ఆధునిక వైద్య ప‌రికారాలు రానున్నాయి. ఇందుకోసం ఎంపీ కేశినేని శివ‌నాథ్ బుధ‌వారం ఢిల్లీలోని కేంద్ర పెట్రోలియం, సహజ వాయు మంత్రి హ‌ర్దీప్ సింగ్ పురి నివాసంలో ఆయ‌న్ను క‌లిశారు.

GGH కు రూ.2.80 కోట్లతో ఆధునిక పరికరాలు

ఎన్‌టీఆర్ జిల్లా విజయవాడలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌కు గా అవసరమైన కీలక బయోమెడికల్ పరికరాల కోసం అవ‌స‌ర‌మైన రూ.2 కోట్ల 80 ల‌క్ష‌లు వారి శాఖ ప‌రిధిలో వున్న ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఆయిల్ ఇండియా లిమిటెడ్, వంటి ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల నుంచి సీఎస్ఆర్ నిధుల కింద ఇప్పించాల‌ని కోర‌టం జ‌రిగింది.

ఎన్టీఆర్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలతో పాటు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు సేవలందిస్తున్న విజయవాడ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో రోగుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో ఆధునిక వైద్య మౌలిక సదుపాయాలు అవసరమయ్యాయని వివరించారు.

కార్డియాలజీ విభాగానికి సంబంధించి ట్రెడ్‌మిల్ టెస్ట్ మెషిన్, 2D ఎకో, బెడ్‌సైడ్ టి.పి.ఐ ప్రక్రియ కోసం పేస్‌మేకర్ పల్స్ జనరేటర్, ఐ.ఎ.బి.పి తో కూడిన మల్టీపారా మానిటర్లు, ఆఫ్తాల్మాలజీ విభాగానికి అవసరమైన విజువల్ ఫీల్డ్ ఎనలైజర్, ఆప్టికల్ కోహెరెన్స్ టోపోగ్రఫీ , న్యూమోటోనోమీటర్, ఫాకోఎమల్సిఫికేషన్ మెషిన్, రేడియాల‌జీ విభాగానికి సంబంధించి 1000 ఎంఏ డిజిటల్ రేడియోగ్రఫీ ఎక్స్-రే యూనిట్ వంటి ఆధునిక వైద్య‌ పరికరాల కోసం సుమారు రూ.2.80 కోట్ల అంచనా వ్యయంతో త‌యారు చేసిన ప్రతిపాదనను కేంద్ర మంత్రి హార్దీప్ సింగ్ కి ఎంపీ కేశినేని శివ‌నాథ్ అంద‌జేశారు.

పెట్రోలియం, సహజ వాయు మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థల సిఎస్‌ఆర్ నిధుల ద్వారా ఈ వైద్య పరికరాలు అందుబాటులోకి వస్తే, విజ‌య‌వాడ ప్ర‌భుత్వ‌ ఆసుపత్రిలో వైద్య సేవల నాణ్యత మరింత మెరుగుపడి, ఎన్టీఆర్ జిల్లాలోని ఏడు నియోజ‌క‌వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు మెరుగైన చికిత్స అందుతుందని ఎంపీ కేశినేని శివనాథ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంపీ కేశినేని శివ‌నాథ్ విజ్ఞ‌ప్తి పై కేంద్ర మంత్రి హార్దీప్ సింగ్ పురి సానుకూలంగా స్పందించారు.

Leave a Reply