హైదరాబాద్ : నగర ప్రజలకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ శుభవార్త చెప్పింది. నగర ప్రజలకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు ఓ వినూత్నమైన పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. రూ.20ధరకే ‘మెట్రో కాంబి టికెట్’ ను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. దీని ద్వారా జనరల్ బస్ టికెట్ మెట్రో ఎక్స్‌ప్రెస్, సాధారణ నెలవారీ బస్ పాస్ ఉన్నవారు హైదరాబాద్ అంతటా మెట్రో డీలక్స్ బస్సుల్లో ప్రయాణించొచ్చు.
ఇప్పటికే ఉన్న నెలవారీ పాస్ హోల్డర్లకు అప్‌గ్రేడ్ చేసిన ప్రయాణ ఎంపికను అందిస్తుంది. నామమాత్రపు అదనపు ఖర్చుతో వారు ఎక్కువ సౌకర్యాన్ని ఆస్వాదించడానికి వీలు కల్పిస్తుంది. హైదరాబాద్‌లోని అన్ని మెట్రో డీలక్స్ సేవలలో ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ మే 7 నుంచి సమ్మెకు సిద్ధమవుతున్న వేళ టీజీఎస్‌ఆర్టీసీ నుంచి ఈ ప్రకటన వచ్చింది.
కాగా, ఆర్టీసీ పరిరక్షణ, ప్రభుత్వంలో విలీనం, కార్మికుల సమస్యల పరిష్కారం, కాంగ్రెస్ ఎన్నికల హామీల అమలు డిమాండ్లతో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ మే 7 నుంచి సమ్మెకు సిద్ధమైన విషయం తెలిసిందే. మే 1న అన్ని డిపోల్లో మేడే జెండాను ఎగురవేసి, మే 5న కార్మిక కవాతు నిర్వహించి, 7నుంచి సమ్మెకు సన్నద్ధం కావాలని కార్మికులకు జేఏసీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం భేషజాలు వీడి, కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న కోరారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు సమ్మె కొనసాగుతుందని జేఏసీ వైస్ చైర్మన్ థామస్‌రెడ్డి స్పష్టంచేశారు.