Aquaculture | రూ.1200 కోట్ల విద్యుత్ రాయితీ

Aquaculture | రూ.1200 కోట్ల విద్యుత్ రాయితీ
- అప్సడ పాలకవర్గ మండలి ప్రమాణ స్వీకారోత్సవంలో
- మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
Aquaculture | కృష్ణా బ్యూరో, ఆంధ్రప్రభ : సర్వే నెంబర్ ఆధారంగా ఆక్వా కల్చర్ రిజిస్ట్రేషన్లు చేసేందుకు చర్యలు తీసుకున్నామని, ఆక్వా రంగానికి 1200 కోట్ల రూపాయల విద్యుత్ రాయితీ ఇస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ పశుసంవర్ధక పాడి పరిశ్రమ మత్స్యశాఖ మంత్రివర్యులు కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. మంగళవారం పెనమలూరులోని రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ వారి కార్యాలయం ప్రాంగణంలో జరిగిన రాష్ట్ర ఆక్వా కల్చర్ అభివృద్ధి అధికార సంస్థ (అప్సడ) పాలకవర్గ మండలి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అప్సడ పాలకమండలి డైరెక్టర్లుగా దేశం శెట్టి వెంకట లక్ష్మీనారాయణ, లంకె నారాయణ ప్రసాద్, గుత్తికొండ శ్రీ రాజబాబు, మహమ్మద్ నూరుద్దీన్, విత్తనాల నాగ శ్రీనివాస్, రాచమల్ల మీరయ్య, వంకా కొండ బాబు, వేగేశ్న సాయి మనోహర రాజు, వేగేశ్న సత్యనారాయణ రాజుల చేత రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ రామ్ శంకర్ నాయక్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ఆక్వా రంగం రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన రంగం అని దేశంలో మన రాష్ట్ర వాటా 29% ఉందన్నారు. ఒకప్పుడు ఆక్వా వ్యాపారం చేయాలంటే ఎటువంటి నిబంధనలు ఉండేవి కావని, ప్రస్తుతం ప్రధానంగా నాణ్యత అంశంపై ఆధారపడి ఉంటుందన్నారు. వ్యవసాయ రంగంలో కానీ, ఆక్వా రంగంలో కానీ ఉత్పత్తికి నాణ్యత ఉంటేనే మంచి ధర లభిస్తుందన్నారు. అప్సడా చైర్మన్ ఉన్న ముఖ్యమంత్రి ఆక్వారంగానికి నాణ్యత, ట్రేసబులిటీ చాలా ముఖ్యమంటారన్నారు. అందుకు అనుగుణంగానే రైతులు మారాల్సి ఉందన్నారు.
ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందన్నారు. అమెరికా అధ్యక్షులు ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వలన ఆక్వా రంగంలో చాలా ఆందోళన కలిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కొద్ది రోజులు ఆ సమస్యను ఎలా అధిగమించాలని, ఆక్వా రంగం ఎలా నిలదొక్కుకోవాలని ఆలోచించారన్నారు. ఎన్ని రకాల సమస్యలు వచ్చినా ఆక్వా రంగం సంతోషంగా ఉందంటే అందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్న చొరవ అభినందనీయమన్నారు. ఆక్వారంగానికి ఒక విధానం కానీ, పద్ధతి కానీ లేదని, కోడిగుడ్లకు ఎలా మార్కెటింగ్ చేశారో అదేవిధంగా ఆక్వారంగానికి కూడా ఒక సంస్థను తయారుచేసే ప్రయత్నంలో ఉన్నామన్నారు.

ఎక్కడబడితే అక్కడ ఆక్వా చెరువులు తవ్వుతున్నారని, అక్కడ కాలుష్యం ఉందో లేదో తెలియని పరిస్థితి అన్నారు. ఒక నిర్ణీత కాల వ్యవధి పెట్టుకొని చేపల చెరువులు కానీ, రొయ్యల చెరువులు కానీ ఏర్పాటు చేసుకొని రికార్డు చేయాల్సి ఉంటుందన్నారు. ఇదివరకు రిజిస్ట్రేషన్ చేసేవారు కాదని ఇప్పుడు రిజిస్ట్రేషన్ చాలా ముఖ్యమన్నారు. తాము అధికారంలోకి వచ్చాక చాలా సులభంగా రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించామన్నారు. ఇప్పటికీ 49% ఆక్వా రంగం రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందన్నారు
ఆక్వా రంగానికి జలవనరుల శాఖ, విద్యుత్ శాఖ వంటి శాఖలతో సంబంధం ఉంటుందని కేవలం మత్స్యశాఖ సమస్యలైతే పరిష్కరిస్తున్నాం కానీ, ఇతర శాఖలతో ముడిపడి ఉన్నప్పుడు అందరితో ఒక ప్రత్యేక కమిటీ వేసి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. సర్వే నెంబర్ ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు. ఈనెల 17వ తేదీ బుధవారం నుండి ఆదేశాలు అమల్లోకి వస్తాయన్నారు. అంతేకాకుండా జియో ట్యాగింగ్ కూడా చేస్తున్నామని ఏ సర్వే నెంబర్లు ఎన్ని ఎకరాలు ఏ రైతు రొయ్యల, చేపల సాగు చేస్తున్నారు అనే వివరాలు పూర్తిగా ఉంటాయన్నారు.
రాష్ట్రంలో చాలా సమస్యలు బాధలు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆక్వా జోను లేదా ఆక్వాఏతర జోను అనే దానితో సంబంధం లేకుండా ఆక్వారంగాన్ని విడిచిపెట్టకుండా, నష్టం రాకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారందరికీ 800 కోట్ల రూపాయల నుండి 1200 కోట్ల రూపాయల విద్యుత్ సబ్సిడీ పెంచి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నామన్నారు. రాష్ట్రంలోని ఉభయగోదావరి జిల్లాలు, ప్రకాశం, కృష్ణ జిల్లాల్లో నూరు శాతం ఆక్వా రంగం రిజిస్ట్రేషన్ కావాలని ఎక్కడ కాకపోయినా మత్స్యశాఖ కమిషనర్ దృష్టికి గాని కో చైర్మన్ దృష్టికి గాని తీసుకురావాలన్నారు.
రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేందుకు ముందుకు రావాలని మారకపోతే చాలా సమస్యలు వస్తాయన్నారు. కృత్రిమ మేధా (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ద్వారా ఏ చెరువులో ఏ సమస్య ఉంది దాని నియంత్రణ ఎలా చేయాలి అనే పరిస్థితి తెలుసుకోవచ్చన్నారు. రాష్ట్ర ఆక్వాకల్చర్ అభివృద్ధి అధికార సంస్థ (అప్సడా) కో చైర్మన్ ఆనం వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ… ఆక్వారంగానికి ట్రేసబులిటీ చాలా ముఖ్యమని, ఆ సమస్య కేవలం మత్స్యశాఖ వలననే పరిష్కారం కాదని రెవెన్యూ క్లియరెన్స్ అవసరం ఉందన్నారు. ఈహెచ్పి జిల్లాలలో ఎక్కువగా ఉందనీ, దీంతో రైతులు నష్టపోతున్నారన్నారు. దానిని నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి చెరువుల్లో కాలుష్యం ఎక్కువ అవుతుందని ఏ విధంగా తగ్గించాలనే అంశంపైన జలవనరుల శాఖ మంత్రితో చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. ట్రేసబులిటీ సమస్యకు సంబంధించి సంబంధిత మంత్రులతో సమావేశం నిర్వహించితే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. విద్యుత్ రాయితీ గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటన చేస్తారన్నారు.
రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ… అప్సడా చైర్మన్గా రాష్ట్ర ముఖ్యమంత్రి, వైస్ చైర్మన్గా మంత్రివర్యులు సారథ్యంలో కోస్తా తీర ప్రాంతాల్లో స్వయం ఉపాధికి ఎంతగానో తోడ్పడుతున్నారన్నారు. తాను కూడా ఆక్వా రైతుగా ఉంటూ వృద్ధి చెందానని, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆక్వారంగానికి విద్యుత్ చార్జీలు తగ్గించారన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఆక్వా రైతులకు అన్ని రకాల ప్రోత్సాహకాలు అందిస్తున్నామన్నారు.
ఏపీఐఐసి చైర్మన్ రామరాజు మాట్లాడుతూ కోస్తా తీర ప్రాంతంలో ఆక్వా, ఆక్వాయేతర జోన్లని కాకుండా అన్నిటికీ అనుమతులు వచ్చే విధంగా చూడాలన్నారు. అమెరికా టారిఫ్ వలన ఆక్వా రంగం చాలా నష్టపోయిందన్నారు.ఆక్వా రైతులకు ఇబ్బంది కలగకుండా ఆక్వా ఉత్పత్తుల ఎగుమతి చేసేందుకు అన్ని చర్యలు రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకుంటున్నారన్నారు. ఆక్వారంగంలో భూమి యజమానుల అనుమతి సమస్య ఉందని అలా కాకుండా సర్వే నెంబర్లతో అనుమతి ఇచ్చే విధంగా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
రాష్ట్ర మత్స్య శాఖ కమిషనర్ రామ్ శంకర్ నాయక్ మాట్లాడుతూ… రాష్ట్ర ముఖ్యమంత్రి దేశంలో మన రాష్ట్ర ఆక్వారంగాన్ని అగ్రగామిగా నిలిపేందుకు అన్ని విధాల కృషి చేస్తున్నారన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6 లక్షల ఎకరాల్లో ఆక్వా కల్చర్ సాగు చేస్తున్నారని, అంచలంచలుగా 30 లక్షల ఎకరాలకు పెంచుకునేందుకు, మత్స్యకారుల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు, స్థూల ఆదాయం కూడా పెరిగే దిశగా రైతులందరూ సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆప్కాబ్ చైర్మన్ నవీన్, పెనమలూరు శాసనసభ్యులు బోడే ప్రసాద్, కాకినాడ శాసనసభ్యులు కొండబాబు అదనపు డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, కృష్ణ ఎన్టీఆర్ జిల్లాల మత్స్యశాఖ అధికారులు సిబ్బంది, పలువురు ఆక్వా రైతులు పాల్గొన్నారు.
