నేటి విజయ వీచిక.. భవిష్యత్తుకు కరదీపిక..
- విజయ వీచిక డాక్యుమెంటు.. భావి ఉత్సవాలకు ఉత్తమ గైడ్..
- సవాళ్లను అధిగమిస్తూ వినూత్నంగా దసరా ఉత్సవాలను నిర్వహించాం..
- ఇదే స్ఫూర్తితో భవానీ దీక్షల విరమణకు పకడ్బందీ ఏర్పాట్లు..
- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, సీపీ ఎస్‌వీ రాజశేఖరబాబు..
ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో : చరిత్ర గతానికి అద్దం.. వర్తమానానికి పాఠం ! మనం ఎంత చేసినా.. మరింత అభివృద్ధికి ఎప్పుడూ చోటు ఉంటూనే ఉంటుందని.. అందుకే దసరా శరన్నవరాత్రుల ఉత్సవాల నిర్వహణలో ఎదురైన సవాళ్లు, వాటిని వినూత్నంగా ఎదుర్కొంటూ విజయ తీరాలకు చేరిన తీరు, సూచనల సమాహారంతో ‘‘విజయ వీచిక’’ పేరుతో డాక్యుమెంటును రూపొందించినట్లు జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ అన్నారు.
కలెక్టర్ లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖరబాబు.. జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థాన ఈవో వీకే శీనా నాయక్‌తో కలిసి శనివారం కలెక్టరేట్‌లోని శ్రీఏవీఎస్ రెడ్డి వీసీ హాల్‌లో విజయ వీచిక.. అభ్యాస దీపిక పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. శాఖల మధ్య పటిష్ట సమన్వయం, 36 ప్రత్యేక సెక్టార్లు, సాంకేతికతతో అనుసంధానం, గౌరవ ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ఎక్కడా ఎలాంటి ఇబ్బందీ లేకుండా దసరా ఉత్సవాలను విజయవంతం చేయగలిగామని, ముఖ్యమంత్రి ప్రశంసలు అందుకున్నామని పేర్కొన్నారు.
ఈ అనుభవం భవిష్యత్తు ఉత్సవాలకు రిఫరెన్స్‌గా ఉండాలనే ఉద్దేశంతోనే సమాచార, పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో విజయ వీచిక పేరుతో పుస్తకాన్ని వెలువరించినట్లు కలెక్టర్ లక్ష్మీశ వివరించారు.
పటిష్ట భద్రత, ప్రణాళిక…
పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖరబాబు మాట్లాడుతూ..విజయ వీచిక పుస్తకం భవిష్యత్తులో జరిగే ఉత్సవాలకు భద్రతతో పాటు వివిధ ఏర్పాట్లకు సంబంధించి సమగ్ర ప్రణాళికల రూపకల్పనకు ఉపయోగపడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు.
మొబైల్ అప్లికేషన్స్, డ్రోన్, ఏఐ సాంకేతికత.. ఇలా ఆధునిక సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగిస్తూ ఉత్సవాలను విజయవంతం చేశామన్నారు. వివిధ ఉత్సవాలకు చేసే హోంవర్క్‌కు ఇలాంటి డాక్యుమెంట్లు ఉపయోగపడతాయని సీపీ రాజశేఖరబాబు అన్నారు.
అందరి సహకారం సమన్వయంతో..
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఈవో వీకే శీనా నాయక్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధుల సహకారం, అధికారుల భాగస్వామ్యంతో అంతా ఒక కుటుంబంగా కలిసి ఉత్సవాలను విజయవంతం చేశామని.. ఉత్సవాల నిర్వహణలో ఇంత మంచి బృందంలో పాలుపంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.
భవిష్యత్తు ఉత్సవాలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించేందుకు ఈ విజయ వీచిక పుస్తకం ఎంతో ఉపయోగపడుతుందని శీనా నాయక్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డీఐపీఆర్‌వో కేవీ రమణరావు, డివిజనల్ పీఆర్‌వో కె.రవి, ఏవీ సూపర్‌వైజర్ వీవీ ప్రసాద్, డా. ఎన్‌టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ డీసీ డా. జె.సుమన్, కలిమిశ్రీ గ్రాఫిక్స్ అధినేత కలిమిశ్రీ తదితరులు పాల్గొన్నారు.

