kurnool | ఘనంగా ధన్వంతరి జయంతి..
kurnool | ఘనంగా ధన్వంతరి జయంతి..
kurnool, కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : ఆయుర్వేద శాస్త్రాన్ని విశ్వ మానవాళికి అందించిన భగవాన్ ధన్వంతరి జయంతి, అలాగే కార్తీక బహుళ త్రయోదశి సందర్భంగా ఆరోగ్యభారతి కర్నూలు శాఖ ఆధ్వర్యంలో కుటుంబ సమ్మేళనం కార్యక్రమం బుధవారం వైభవంగా జరిగింది. కల్లూరులోని శ్రీ వాసవి కళ్యాణ మంటపంలో జరిగిన ఈ కార్యక్రమం సాయంత్రం 7.30 గంటలకు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదోని నియోజకవర్గ శాసన సభ్యులు డాక్టర్ పార్థసారథి, (Parthasarathi) ముఖ్యవక్తగా ఆరోగ్యభారతి క్షేత్ర సంఘటనా కార్యదర్శి ఎ. కుమారస్వామి పాల్గొన్నారు. వీరి చేతుల మీదుగా ఆరోగ్యభారతి వార్షిక క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది.
ఆయుర్వేదం, శుభ్రత, కాలుష్య నియంత్రణ, గృహవైద్యం ప్రాముఖ్యతపై నిపుణులు ప్రసంగించారు. AP స్టేట్ కమిటీ సభ్యుడు, ఆరోగ్యభారతి జిల్లా అధ్యక్షుడు, రిటైర్డ్ జిల్లా క్షయవ్యాధి నివారణాధికారి డాక్టర్ పి. మోక్షేశ్వరుడు.. పరిశుభ్రత, కాలుష్యం పై అవగాహన కల్పించారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఎల్. భాస్కర్.. ప్రజా ఆరోగ్యంపై సందేశమిచ్చారు. రిటైర్డ్ సీనియర్ ఆయుర్వేద మెడికల్ ఆఫీసర్, డాక్టర్ ద్వారం ప్రభాకర రెడ్డి.. మన ఆరోగ్యం–గృహవైద్యం పై మాట్లాడారు.
ఈ కార్యక్రమానికి సుమారు 200 కుటుంబాలు, నగర ప్రజలు, ఆరోగ్యభారతి కార్యకర్తలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నగర అధ్యక్షుడు డాక్టర్ యస్. వెంకటరమణ (రిటైర్డ్ ప్రొఫెసర్, కర్నూలు మెడికల్ కాలేజి), రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఎం.డి.వి.యన్ రామశర్మ, జిల్లా కార్యదర్శి బి. సత్యనారాయణ రెడ్డి తదితరులు వార్షిక నివేదికను సమర్పించారు. ఆయుర్వేద ప్రాముఖ్యతను విశ్వవ్యాప్తంగా చాటుతూ, ఆరోగ్యభారతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కుటుంబ సమ్మేళనం ప్రజల్లో ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించిందని నిర్వాహకులు తెలిపారు.
