special camp : 14న మీ డ‌బ్బు.. మీ హ‌క్కు ప్ర‌త్యేక శిబిరం

జిల్లా లీడ్ బ్యాంకు మేనేజ‌ర్ కె.ప్రియాంక‌..

విజయవాడ, ఆంధ్రప్రభ : మీ డ‌బ్బు-మీ హ‌క్కు నినాదంతో భార‌త ప్ర‌భుత్వం, రిజ‌ర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఈ ఏడాది అక్టోబ‌ర్ నుంచి డిసెంబ‌ర్ వ‌ర‌కు ప్ర‌త్యేక ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తోంద‌ని.. ఇందులో భాగంగా జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ వారి మార్గ‌నిర్దేశ‌నం మేర‌కు ఈ నెల 14న క‌లెక్ట‌రేట్‌లో ప్ర‌త్యేక శిబిరాన్ని ఏర్పాట్లు చేయ‌నున్న‌ట్లు జిల్లా ఎల్‌డీఎం కె.ప్రియాంక బుధ‌వారం ఒక‌ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. మీ డ‌బ్బు – మీ హ‌క్కు కార్య‌క్ర‌మం ద్వారా ప‌దేళ్లు, అంతకు మించి లావాదేవీలు జరగని బ్యాంకు ఖాతాల్లోని సొమ్మును బ్యాంకులు అర్హుల‌కు తిరిగి ఇచ్చేయడం జరుగుతుందన్నారు.

ఖాతాదారుల మరణం, చిరునామా మార్పు, నామిని వివరాల్లో లోపాలు, మ‌ర‌చిపోవ‌డం వంటి కారణాలతో కొన్ని ఖాతాల్లోని డ‌బ్బు లబ్ధిదారులకు చేర‌డం లేద‌న్నారు. ఇలా ఎన్‌టీఆర్ జిల్లాలో మొత్తం 5,50,778 బ్యాంకు ఖాతాల్లో రూ. 145.47 కోట్లు ఉన్నట్లు వివ‌రించారు. వీటికి సంబంధించిన వ్యక్తులు, సంస్థల ప్రతినిధులు సరైన ధ్రువపత్రాలతో ఈకేవైసీ పూర్తిచేసి తమ సొమ్మును తిరిగి పొందవచ్చన్నారు. ఇటీవ‌ల క‌లెక్ట‌రేట్‌లో జ‌రిగిన డీసీసీ-డీఎల్ఆర్‌సీ స‌మావేశంలో క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ వారు యూబీఐ రీజ‌న‌ల్ హెడ్ ఎంవీ తిల‌క్, ఆర్‌బీఐ అధికారి న‌వీన్ త‌దిత‌రుల‌తో మీ డ‌బ్బు – మీ హ‌క్కు ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంపై చ‌ర్చించి.. శాస‌న‌స‌భ్యులు బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు, వివిధ బ్యాంకుల అధికారుల‌తో క‌లిసి ప్ర‌చార కార్య‌క్ర‌మ పోస్ట‌ర్ల‌ను కూడా ఆవిష్క‌రించ‌డం జ‌రిగింద‌ని ఎల్‌డీఎం ప్రియాంక తెలిపారు.

Leave a Reply