ఆదివాసీ మహిళల విజయగాధ…

ఆర్ధికాభివృద్ధిలో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న ఆదివాసీ మహిళలు
- ఇప్పపువ్వు లడ్డూల ఉత్పత్తితో వార్షికంగా రూ 1. 27 కోట్ల టర్నోవర్ సాధిస్తున్న ఆదివాసీ మహిళలు
- ఆదివాసీ మహిళలను అభినందించిన మంత్రి సీతక్క(file photo)
హైదరాబాద్, ఆంధ్రప్రభ : మహిళల ఆర్ధిక అభ్యున్నతికి ప్రభుత్వం చేయూతగా ఉంటుందనీ అందులో భాగంగా ఆదివాసీ గిరిజన మహిళల సంపూర్ణ ఆర్ధిక చేకూర్పుకు ఉట్నూర్ ఐటీడీఎ(ITDA) నైపున్యాభివృద్ధి విభాగం ద్వారా కృషి చేస్తుందని రాష్ట్ర పంచాయతీ, గ్రామీణాభివృద్ధి & మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క)(Minister Danasari Anasuya (Sitakka)) అన్నారు. ఆరోగ్య సంరక్షణలో ప్రకృతి సిద్ధంగా లభించే ఆహార పదార్ధాలకు ప్రాధాన్యత పెరుగుతుందన్నారు.
ఆదివాసీ గిరిజనుల జీవన విధానంలో అత్యంత పోషక విలువలున్న ఇప్పపువ్వు(Ippapuvvu) కు చాలా విశిష్ఠత ఉంది. స్వయం సహాయక సంఘాలతో ఆదివాసీ గిరిజన మహిళలు ఆర్ధిక అక్షరాస్యత సాధించారు. వారికి ప్రకృతి సిద్ధంగా లభిస్తున్న ఇప్పపువ్వుతో లడ్డూల తయారిపై మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లా(Yavatmal district)కు 12 మందిని పంపి, శిక్షణ ఇప్పించారు. ఉట్నూర్ లో రూ 40 లక్షల వ్యయంతో నెలకొల్పిన ఇప్పపువ్వు లడ్డు తయారీ యూనిట్ కు TRICOR నుండి సబ్సిడీగా 60% ఇచ్చారు. 30% బ్యాంకు రుణం కాగా, మహిళల వాటాగా 10% భరించడం జరిగింది.
ఇప్పపువ్వు లడ్డుల తయారిలో జాతీయ పోషకాహార సంస్థ (NIN) నిపుణులు నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం ఇప్పపువ్వు కు పల్లీలు, నువ్వులు, బెల్లం, కాజు, ఎండు ద్రాక్షలను కలిపి సన్ ఫ్లవర్ ఆయిల్ తో రుచి నాణ్యత, పోషక విలువలుండే లడ్డూలు తయారు చేస్తున్నారు. ఈ పదార్ధాలను స్థానికంగా హోల్ సేల్ షాప్స్(Wholesale Shops) నుండి తీసుకుంటున్నారు.
ప్రతి సంవత్సరం మార్చి నెలలో లభించే ఇప్పపువ్వును ఉమ్మడి ఆదిలాబాద్ ముఖ్యంగా కుమరం భీం- ఆసిఫాబాద్ జిల్లా ఆదివాసీ గిరిజనుల నుండి దాదాపు 150 క్వింటాళ్ళును సేకరించి, ఐటీడీఎ గోడౌన్ లో నిల్వ చేస్తున్నారు. దాదాపు వంద కుటుంబాలు ఇప్పపువ్వు సేకరణ ద్వారా లబ్ధిపొందుతున్నామన్నారు.
గిరిజన పోషణ మిత్ర పధకం కింద
పోషక విలువలున్న ఇప్పపువ్వు లడ్డులను ఉట్నూర్ ఐటీడీఎ పరిధిలోని 77 ఆశ్రమ పాఠశాలలకు ప్రతి నెలా 2,300 కిలోలను సరఫరా చేస్తున్నారన్నారు. Open మార్కెట్‌లో ప్రతి నెలా 900 కిలోల లడ్డూలు విక్రయిస్తున్నారని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఆశ్రమ పాఠశాలలకు కిలో రూ. 320/- చొప్పున, ఓపెన్ మార్కెట్ లో కిలో రూ 360/- చొప్పున(Rs 360/- per kg) విక్రయిస్తున్నారు. హైదరాబాద్ శిల్పారామంలోని ఇందిరా మహిళా శక్తి కేంద్రంలో ఒకటి, బాలాపూర్‌లో ఒక ఇప్పపువ్వు లడ్డు విక్రయ కేంద్రం ఏర్పాటుచేశామన్నారు.
శిల్పారామంలో వారానికి 15 కిలోలు, బాలాపూర్ లో వారానికి 25 కిలోల ఇప్పపువ్వు లడ్డులు విక్రయం అవుతున్నాయన్నారు. ఆదివాసీ గిరిజనులే ఇక్కడ ఇప్పపువ్వు లడ్డులు అమ్ముతున్నారనీ, అలాగే ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా దర్భార్ సందర్బంగా ఐటీడీఎ ప్రాంగణంలో ఒక స్టాల్ ఏర్పాటు చేశారన్నారు.
ఇప్పపువ్వు లడ్డూల(Ippapuvu laddus) తయారీ, విక్రయం ద్వారా వార్షికంగా రూ. 1 కోటి 27 లక్షలు టర్నోవర్ సాధించినట్లు భీం భాయి ఆదివాసీ మహిళా సహకార సంఘం నిర్వాహకురాలు భగూ భాయి తెలిపారు. తద్వారా తమ సంఘానికి ప్రతి నెలా రూ. 3 లక్షలు లబ్ది చేకూరుతున్నట్లు ఆమె తెలిపారు. ఉట్నూర్ లో పర్యటించిన సందర్బంగా ఆదివాసీ మహిళల సాధికారతను తెలుసుకున్న రాష్ట్ర పంచాయతీ, గ్రామీణాభివృద్ధి & మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ ( సీతక్క) ఆదివాసీ మహిళలను అభిందించారు.

మహిళల కృషిని, ఆర్ధిక స్వావలంబన గురించి మన్ కీ బాత్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) ప్రస్థావించారన్నారు. గిరిజన ప్రాంతంలోని సహజ వనరుల ఆధారిత జీవనోపాధి పెంపుదలకు, ఐటీడీఎ చేపట్టిన ఆదివాసీ మహిళా సాధికారతకు ఇదొక ప్రతీకగా ఎదుగుతుందని మంత్రి సీతక్క చెప్పారు.



