13 క్వింటాళ్లు వద్దు.. 7 క్వింటాల్లే కొంటాం..!

13 క్వింటాళ్లు వద్దు.. 7 క్వింటాల్లే కొంటాం..!
- తేమ నిబంధనలకు తోడు కొనుగోళ్ల పరిమితి పై సీసీఐ కొత్త మెలిక..!
- మార్కెట్లో పత్తి రైతు పరిస్థితి దైన్యం..!
ఉమ్మడి ఆదిలాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : భారీ వర్షాలతో పంట దిగుబడి లేక, మార్కెట్(Market) లో తేమశాతం ఆంక్షలతో కొనుగోళ్లు జరగక పత్తి రైతు దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటుంటే.. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సీసీఐ కొర్రీలతో మరో ఆర్డర్ జారీ చేసింది. మార్కెట్ యార్డులో పత్తిని విక్రయించే రైతు ఎకరాకు 13 క్వింటాళ్ల (13 quintals) పరిమితితో విక్రయించాల్సి ఉండగా, ఈ నిబంధన తొలగించి ఇక రైతు పండించిన ఎకరా పంట ఏడు క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామని ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదివరకే మార్కెట్లో 8 నుండి 12% లోపు తేమ ఉన్న పత్తిని మాత్రమే కొంటున్న సిసిఐ తాజాగా కొనుగోళ్ల పరిమితిని 7 క్వింటాళ్లు మాత్రమే నిబంధన పెట్టడంతో రైతులు మండిపడ్డారు. కిసాన్ కపాస్ యాప్(Kisan Kapas App)లో స్లాట్ బుకింగ్ నిన్న చేసుకున్న రైతులకు ఈరోజు పరిమితి ఆంక్షలు ఆందోళన కలిగించాయి. సిసిఐ అధికారుల తీరుపై మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న(Jogu Ramanna) ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. పత్తి తేమశాతాన్ని సడలించాలని కోరుతుంటే కేంద్ర ప్రభుత్వం సడలించకపోగా ఎకరా పరిమితి ఏడు క్వింటాళ్లే కొంటామని చెప్పడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. కాగా ఈ రోజు పత్తి కొనుగోళ్లలో ప్రతిష్టంభన ఏర్పడింది.
