యమ పాశం  

ఇనుప ద్రవంలో కరిగిన కార్మికుడు

తిరుపతి కలర్​ షైన్​ ఫ్యాక్టరీలో దుర్ఘటన

మరో పదిమందికి గాయాలు

ఆంధ్రప్రభ, గూడూరు (తిరుపతి జిల్లా)  గూడూరు మండలం తుంగపాలెం సమీపంలోని  కలర్ షైన్ ఫ్యాక్టరీలో శనివారం జింక్ పాట్ వద్దా పేలుడు సంభవించి ఉత్తరప్రదేశ్ కు చెందిన ఆదిత్య (25) అనే యువ కార్మికుడు దుర్మరణం చెందగా.. పదిమంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.  ఈ దుర్ఘటన   సమాచారంతో  పోలీసులు ఫ్యాక్టరీకి చేరుకున్నారు.  ప్రమాదానికి కారణాలపై  ఆరా తీశారు. పోలీసుల సమాచారం మేరకు రేకులను తయారు చేసే కలర్ షైన్ ఫ్యాక్టరీలో  ఉద్యోగులు యథావిధిగా ప్రతిరోజు జింక్ పాట్ వద్ద మిషనరీ ని పరిశీలించి పనులు ప్రారంభిస్తారు.అదేవిధంగా శనివారం మిషనరీని పరిశీలిస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది.ఈ ప్రమాదంలో ఆదిత్య అనే యువకుడు ప్రమాదవశాత్తు ఐరన్ మెటల్ కరిగించే  కెమికల్ టబ్ ​లో పడి మృతి చెందాడు. పదిమందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హాస్పిటల్ కు తరలించారు. ప్రమాద  స్థలాన్ని రూరల్ సీఐ కిషోర్ బాబు తాహసిల్దార్ ప్రసాద్ పరిశీలించారు. సీఐ కిషోర్ బాబు మాట్లాడుతూ అకస్మాత్తుగా పేలుడు సంభవించి ఒక వ్యక్తి మృతి చెందాడని పదిమంది గాయాలయ్యాయని అన్నారు.ప్రమాదానికి గల కారణాలను విచారిస్తున్నామని విచారణలో పూర్తి వివరాలు తెలుస్తాయని పేర్కొన్నారు. క్షతగాత్రులను హుటాహుతిన నెల్లూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఇనుప ద్రవంలో కరిగిపోయాడు

గూడూరు మండల పరిధిలోని ఎంతో పెద్ద ఫ్యాక్టరీగా పేరు ఉన్న కలర్ షైన్ పరిశ్రమలో బతుకుతెరువు కోసం ఇతర రాష్ట్రాల నుండి ఎంతోమంది కార్మికులు పొట్ట చేత పట్టుకొని వచ్చి ఇక్కడ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదాల్లో  కొందరు ప్రాణాలు కోల్పోతే, మరి కొందరు  దివ్యాంగులుగా మారిన ఘటనలెన్నో ఉన్నాయి.  శనివారం జరిగిన భారీ పేలుడు ప్రమాదంలో బతుకుదెరువు కోసం వచ్చి ఐరన్ మెటల్ కరిగించేటువంటి కెమికల్ లో ప్రమాదవశాత్తు ఉత్తరప్రదేశ్ కు చెందిన ఆదిత్య పడి  ద్రవంగా  మారిపోయాడు. ఇనుపద్రవంలో కరిగిపోయాడు.  కుటుంబ సభ్యులకు కడసారి  చూపు దక్కలేదు.

మీడియా ప్రతినిధులపై  యాజమాన్యం అక్కసు

తుంగపాలెం వద్ద కలర్ షైన్ రేకుల పరిశ్రమలో జరిగిన అగ్నిప్రమాదం ఘటనపై  కవరేజ్ కి వెళ్లిన మీడియా వారిపై పరిశ్రమ ప్రతినిధులు దురుసుగా ప్రవర్తించడంతో కంపెనీ గేటు ఎదుట మీడియా ప్రతనిధులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

Leave a Reply