ఉరుకొండలో ప్రజావాణి ప్రారంభం.. తొలి దరఖాస్తు స్వీకరణ

ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదుల స్వీకరణ.. సమస్యల పరిష్కారానికి అధికారుల హామీ

ఉరుకొండ, ఆంధ్రప్రభ: ఉరుకొండ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద సోమవారం ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమైంది. ప్రజావాణి నోడల్ అధికారి, ఎంపీడీవో సత్యపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. రాచలపల్లి గ్రామానికి చెందిన 73 ఏళ్ల కక్షే రాధాకృష్ణ, తండ్రి బాలకిషన్.. రెవెన్యూ శాఖకు సంబంధించిన సమస్యపై తొలి దరఖాస్తును సమర్పించారు. దరఖాస్తును స్వీకరించిన నోడల్ అధికారి సత్యపాల్ రెడ్డి, సంబంధిత రెవెన్యూ అధికారి, మండల తహసీల్దార్ యూసుబ్ అలీ ఫిర్యాదుదారుడితో కలిసి సమస్యపై చర్చించారు.

సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి అబ్దుల్ రహీం, మండల వ్యవసాయ అధికారి దీప్తి, మండల విద్యుత్ అధికారి సాయన్న గౌడ్, మండల పశువైద్యాధికారి రాజేష్, ఏఎస్ఐ లచ్చునాయక్‌తోపాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రజల సమస్యలను ఒకే వేదికపై స్వీకరించి, సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కరించేందుకు ప్రజావాణి కార్యక్రమం ఉపయోగపడుతుందని నోడల్ అధికారి, ఎంపీడీవో సత్యపాల్ రెడ్డి తెలిపారు.