ప్రభుత్వ వైఫల్యాలే అజెండాగా బీఆర్ఎస్ దూకుడు
బాల్కొండలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వ్యూహం
భీంగల్ టౌన్, ఆంధ్రప్రభ: పేదింటి ఆడబిడ్డల వివాహాలకు అండగా నిలిచే కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచుతోంది. ప్రభుత్వ వైఫల్యాలు, ఎన్నికల హామీల అమలు తీరునే ప్రధాన అజెండాగా చేసుకుని బాల్కొండ నియోజకవర్గంలో వరుస నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రారంభించిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేద కుటుంబాలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో కళ్యాణలక్ష్మి పథకం కింద ఇచ్చే ఆర్థిక సాయానికి అదనంగా తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని అమలు చేయడంలో విఫలమైందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఇప్పటికే అమల్లో ఉన్న సంక్షేమ పథకాలను కొనసాగించడంతోపాటు మరింత బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేసే దిశగా వ్యవహరిస్తోందని విమర్శిస్తోంది. ఈ అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి ప్రభుత్వంపై రాజకీయ ఒత్తిడి పెంచాలని నిర్ణయించిన బీఆర్ఎస్.. నియోజకవర్గంలో క్షేత్రస్థాయి ఆందోళనలకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా సోమవారం ఉదయం 10 గంటలకు వేల్పూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించనున్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
బాల్కొండ నియోజకవర్గంలో పార్టీ శ్రేణులను సమీకరించి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లడంతోపాటు, కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నించేందుకు వేముల ప్రశాంత్ రెడ్డి వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు సంబంధించిన సంక్షేమ పథకాల అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని బీఆర్ఎస్ భావిస్తోంది. హామీల అమలు, సంక్షేమ పథకాల కొనసాగింపు అంశాలపై ప్రజల్లో చర్చ జరిగేలా నియోజకవర్గ స్థాయిలో వరుస కార్యక్రమాలు చేపట్టేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో ప్రజా సమస్యలను కేంద్రంగా చేసుకుని మరిన్ని నిరసనలు, ఆందోళనలు నిర్వహించి ప్రభుత్వాన్ని నిలదీయాలని పార్టీ నిర్ణయించినట్లు సమాచారం. “హామీలను అమలు చేయాలి.. పేదల సంక్షేమ పథకాలను కొనసాగించాలి” అనే డిమాండ్‌తో నిర్వహిస్తున్న వేల్పూర్ నిరసన కార్యక్రమానికి బాల్కొండ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పార్టీ పిలుపునిచ్చింది.
