తెలంగాణ ముసాయిదా ఓటర్ల జాబితాపై అన్ని పార్టీల్లోనూ ఉత్కంఠ
నేడే ముసాయిదా.. అందరి లెక్కలు తేలేది అందులోనే
గ్రేటర్ పరిధిలోనే 43 లక్షల ఓట్ల గల్లంతు
శేరిలింగంపల్లిలో అత్యధిక ఓట్ల తొలగింపు
ఓల్డ్ సిటీ ఓట్లపై మజ్లిస్ ప్రత్యేక దృష్టి
స్పష్టతతో బీజేపీ.. ఎన్నికల వ్యూహంపై ఫోకస్
గల్లంతును ముందే పసిగట్టిన బీఆర్ఎస్
హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: ముసాయిదా ఓటర్ల జాబితా రాక కోసం రాజకీయ పార్టీలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా ప్రక్రియ ముగియడంతో పార్టీలన్నీ తొలగింపుల్లో ఉన్న 74 లక్షల ఓటర్లపై ఆందోళనలో ఉన్నాయి. గతంలో ఉన్న ఓటర్లు ఎంత మంది? ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించింది ఎంత మంది? సోమవారం విడుదల కానున్న ముసాయిదా ఓటర్ల జాబితాలో ఉండేది ఎంత మంది? తొలగించే ఓటర్ల సంఖ్య ఎంత? అని లెక్కలు వేసుకుంటున్నాయి.
అత్యధిక ఓట్లు కోల్పోయింది శేరిలింగంపల్లి
హైదరాబాద్ నగరం, శివారు ప్రాంతాల్లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కొ దాంట్లో రెండు లక్షలకు పైగా ఓట్లు తొలగించారు. ఎస్ఐఆర్లో అత్యధిక ఓట్లు తొలగించిన నియోజకవర్గంగా శేరిలింగంపల్లి నిలిచింది. అత్యధిక ఓట్లు తొలగించడంతో రాష్ట్రంలో అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గంగా కుత్బుల్లాపూర్ నిలిచింది. మేడ్చల్, శేరిలింగంపల్లి నియోజకవర్గాలు తరువాత స్థానాల్లో నిలిచాయి. నాలుగు లక్షల కంటే ఎక్కువ ఓటర్లు ఉన్న నియోజకవర్గాలు ఇవే కావడం విశేషం.
రంగారెడ్డి జిల్లాలో 38,99,743 మంది ఓటర్లు ఉండగా, అందులో 12,86,720 ఓట్లు (34.78 శాతం) తగ్గే అవకాశం ఉన్నట్లు తాజా వివరాలు సూచిస్తున్నాయి. అత్యధిక ప్రభావం గ్రేటర్ హైదరాబాద్‌కు ఆనుకుని ఉన్న నియోజకవర్గాల్లోనే కనిపిస్తోంది. మహేశ్వరం – 3.35 లక్షలు, శేరిలింగంపల్లి – 3.29 లక్షలు, ఎల్బీనగర్ – 2.70 లక్షలు, రాజేంద్రనగర్ – 2.47 లక్షల ఓట్లు డిలీట్ అయ్యే చాన్స్ ఉంది. ఈ నియోజకవర్గాలన్నీ హైదరాబాద్ మహానగర విస్తరణతో బలంగా అనుసంధానమై ఉన్న ప్రాంతాలే. ఉద్యోగాలు, రియల్ ఎస్టేట్, ఐటీ రంగం, విద్య, వలసలు వంటి కారణాలతో ఇక్కడ ఓటర్ల మార్పులు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
గణాంకాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 73.38 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించే అవకాశం ఉండగా.. అందులో 43 లక్షలు గ్రేటర్ హైదరాబాద్‌లోనివే కావడం గమనార్హం. జీహెచ్ఎంసీ ఎన్నికలు దగ్గర్లో ఉండటంతో ఆ మేరకు ఓటు బ్యాంక్‌పై ప్రభావం చూపుతుందని రాజకీయ పక్షాలు ఆందోళన చెందుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీ జూమ్ మీటింగ్‌లు పెట్టినా, సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఎంతగా పార్టీ శ్రేణులను అదిలించినా ఆశించిన ప్రయోజనం నెరవేరలేదు. అర్హులైన ఒక్కరి పేరు కూడా పోకుండా వ్యవహరించాలంటూ సర్ ప్రక్రియకు ముందు, సర్ ప్రక్రియ జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులతోపాటు నియోజకవర్గాల ఇన్చార్జిలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేసినా, కొద్దిమంది ఎమ్మెల్యేలు పెద్దగా దృష్టి పెట్టలేదని గుర్తించారు. స్వయంగా ముఖ్యమంత్రి తన సొంత కొడంగల్ నియోజకవర్గంలో రివ్యూ చేసినా అక్కడ 34 వేల మంది పేర్లు జాబితా నుంచి పోనున్నాయని ప్రాథమిక సమాచారం. కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాల్లో ఎక్కడెన్ని పేర్లు జాబితా నుంచి తొలగిందీ ఈ నెల 18 తర్వాత రివ్యూ జరగనున్నది. అర్హులైనవారిని గుర్తించి తిరిగి చేర్పించడంపై పీసీసీ కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నది.
సెగ్మెంట్ల వారీగా ఓల్డ్ సిటీ ఓట్లపైనే మజ్లిస్ స్పెషల్ ఫోకస్…
సర్ ప్రక్రియ మొదలు కావడానికి ముందు మ్యాపింగ్ ప్రాసెస్ సమయంలోనే మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ అప్రమత్తమయ్యారు. ఎక్కడెక్కడ ఎక్కువ సంఖ్యలో డిలీట్ అవకాశం ఉందో అంచనా వేసుకొని అక్కడి బూత్ లెవల్ ఏజెంట్లను అప్రమత్తం చేశారు. మ్యాపింగ్ మ్యాచ్ కాని ఓటర్ల వివరాలను ఆధారాలను చూపించి నమోదు చేయించడంపై మజ్లిస్ చీఫ్ దృష్టి పెట్టారు.
ఇప్పుడు గల్లంతైన పేర్లలో ఓల్డ్ సిటీకి చెందినవి గణనీయంగా ఉన్నట్లు అనుమానాలు తలెత్తాయి. 11.26 లక్షల మంది ఆచూకీ దొరకలేదని ఈసీ వెల్లడించడంతో.. ఇందులో ఎక్కువగా ఓల్డ్ సిటీకి సంబంధించనివేనన్న గుబులు లీడర్లలో మొదలైంది. చాంద్రాయణగుట్ట, మలక్‌పేట్, యాకుత్‌పుర, కార్వాన్.. మొత్తం నాలుగు నియోజకవర్గాల్లోనే ఆరు లక్షల ఓట్లు గల్లంతయ్యే అవకాశం కనిపిస్తున్నది. ఇక చార్మినార్, బహదూర్‌పుర, నాంపల్లి లాంటి ప్రాంతాల్లోవి కూడా కలిపితే ఈ సంఖ్య పెరుగుతుంది. దీంతో ఓల్డ్ సిటీలో తగ్గుతున్న ఓటర్ల సంఖ్య మజ్లిస్ పార్టీని ఆందోళనకు గురి చేస్తున్నది.
స్పష్టతతో బీజేపీ…
ఎన్నికల్లో లాభిస్తుందని బీజేపీ అంచనా వేసుకుంటున్నది. ఎలాగూ రాష్ట్రంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై దృష్టి పెట్టినందున జాతీయ నాయకులు ప్రతి నెలా ఒకరు వస్తారని హైకమాండ్ నుంచి సంకేతాలు రావడంతో ముసాయిదా ఓటర్ లిస్ట్ తర్వాత ఏయే నియోజకవర్గంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారో దానికి అనుగుణంగా వ్యూహ రచనపై బీజేపీ ఫోకస్ పెట్టనున్నది.
వెనక్కురాని ఫారాలు.. 73 లక్షలు
రాష్ట్రంలో చేపట్టిన ప్రత్యేక ఓటర్ల సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)తో రాష్ట్రంలో 2.64 కోట్ల మంది ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించినట్లుగా ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం ఓటర్లు 3.38 కోట్లు ఉండగా ఇందులో 78.30 శాతం ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించినట్లుగా, మరొక 73.39 లక్షల మంది ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించలేదని, వీరు 21.70 శాతం ఉన్నట్టుగా ఎన్నికల సంఘం తెలిపింది.
తొలగించిన ఓటర్లలో అత్యధికంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాకు చెందిన వారు ఉన్నారు. హైదరాబాద్ జిల్లాలో 19.41 లక్షలు, రంగారెడ్డి జిల్లాలో 12.87 లక్షలు, మేడ్చల్ జిల్లాలో 10.71 లక్షల మంది ఓటర్లను తొలగించారు. తొలగించిన వారిలో 9.22 లక్షల మంది చనిపోయిన వారని, ఆన్ట్రేసబుల్, అబ్సెంట్ ఓటర్లు 11.25 లక్షల మంది, షిఫ్ట్ అయిన వారు 45.18 లక్షలు, రెండు చోట్ల ఓట్లు ఉన్న వారు 6.70 లక్షలు ఉన్నారు.
సోమవారం ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. సెప్టెంబర్ 16 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 15 వరకు నోటీసులు ఇవ్వడం, అభ్యంతరాలను పరిష్కరించడం చేస్తారు. అక్టోబర్ 19న తుది ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు.
ప్రస్తుతానికి రాష్ట్రంలో తొలగిపోతాయనుకుంటున్న 73 లక్షల ఓటర్ల వల్ల ఏ పార్టీకి నష్టం వాటిల్లనుందనే విషయం అందరినీ కలచివేస్తోంది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌తోపాటు బెంగాల్, బీహార్, ఒడిశా, జార్ఖండ్, మహారాష్ట్ర, కేరళ తదితర రాష్ట్రాలకు చెందిన వారున్నారని అంచనా వేస్తున్నారు. వీరందరూ తమ సొంత రాష్ట్రంలోనూ ఓటరుగా కొనసాగడానికి మొగ్గు చూపారని, అదే సమయంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు తమ సొంత గ్రామంలో ఓటు ఉంచుకోవడానికి మొగ్గు చూపారు. ఈ కారణంగానే 43 లక్షల ఓట్లు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లోపల తొలగాయని చెబుతున్నారు.
గల్లంతు ముందే పసిగట్టిన బీఆర్ఎస్
సర్ కారణంగా భారీస్థాయిలోనే పేర్లు గల్లంతయ్యే ప్రమాదాన్ని బీఆర్ఎస్ ముందుగానే పసిగట్టింది. సర్ సందర్భంగా ఏమేం సందేహాలు వస్తాయో, ఎలాంటి డాక్యుమెంట్లను బీఎల్ఓలకు చూపించి డిలీట్ కాకుండా చూసుకోవాలో ప్రజలకు అవగతమయ్యేలా నియోజకవర్గాల ఇన్చార్జిలకు, లోకల్ లీడర్లకు, కార్యకర్తలకు, బూత్ లెవల్ ఏజెంట్లకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
జీహెచ్ఎంసీ, దాని పరిసరాల్లోని నియోజకవర్గాల్లో కేటీఆర్ ప్రత్యేకంగా రివ్యూ సమావేశాలు పెట్టి.. అవగాహన కల్పించారు. హరీష్‌రావు సైతం కొన్ని నియోజకవర్గాల్లో పర్యటించి మీటింగ్‌లు పెట్టారు. అయినా గ్రేటర్, దాని పరిధిలో 43 లక్షలకు పైగా పేర్లు గల్లంతవడం ఆ పార్టీకి మింగుడు పడడంలేదు. ఇప్పుడు ఓట్లు తగ్గే నియోజకవర్గాల్లో మెజారిటీ స్థానాలు బీఆర్ఎస్ చేతిలోనే ఉండడంతో ఈ నష్టాన్ని ఎలా భర్తీ చేయాలనే దానిపై చర్చ జరుగుతోంది.
