హలో యువ.. రానున్న కార్పొరేషన్ సమరానికి సయ్యా..
- మంత్రి నారా లోకేశ్‌తో టీడీపీ యువ నాయకుడు బొండా సిద్ధార్థ కరచాలనం
విజయవాడ సెంట్రల్, ఆంధ్రప్రభ : పంద్రాగస్టు వేడుకలకు మంత్రి నారా లోకేశ్ సింగ్‌నగర్ ప్రాంతానికి విచ్చేశారు. సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమాతోపాటు టీడీపీ శ్రేణులు మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా టీడీపీ యువ నాయకుడు బొండా సిద్ధార్థ కూడా మంత్రి నారా లోకేశ్‌తో కరచాలనం చేశారు. ఈ సమయంలో నారా లోకేశ్ ‘హాయ్ యువ.. రానున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించు’ అని చెప్పినట్లు తన పక్కనున్న టీడీపీ శ్రేణులు పేర్కొన్నాయి. దీంతో ఈ అంశం ప్రస్తుతం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్లలో కూటమి విజయం సాధించేలా బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో పి-4 పథకాన్ని ప్రవేశపెట్టారు. సెంట్రల్ నియోజకవర్గంలో పి-4 మార్గదర్శకుల్లో బొండా సిద్ధార్థ కూడా ఒకరిగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సర్ కార్యక్రమంలో భాగంగా బొండా సిద్ధార్థ సెంట్రల్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో ప్రజల వద్దకు వెళ్లి ఓటు హక్కు గొప్పతనాన్ని వివరించడంతోపాటు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
‘ఇంటింటికీ టీడీపీ’ కార్యక్రమంలో భాగంగా రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో చంద్రబాబు చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఆయా డివిజన్లలో ప్రజలు జీవనోపాధి కోసం కుట్టు మిషన్లు, ఇస్త్రీ పెట్టెలు, చిరు వ్యాపారాల కోసం తోపుడు బండ్లు కావాలని కోరగా, బొండా సిద్ధార్థ సొంత నిధులతో వాటిని అందించి వారి జీవనోపాధి మెరుగుపడేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా తర్వాత ఆయన తనయులకు నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్లపై అవగాహన ఉందని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. రానున్న స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మంత్రి నారా లోకేశ్ తన సూచనలను బొండా సిద్ధార్థతో పంచుకున్నారని పలువురు భావిస్తున్నారు.
