సర్దార్ గౌతు లచ్చన్న ఆశయాలు నేటి తరానికి ఆదర్శం..

విజయవాడ, ఆంధ్రప్రభ : స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక విప్లవకారుడు, రైతు–కార్మిక పక్షపాతి సర్దార్ గౌతు లచ్చన్న 117వ జయంతి వేడుకలను ఆదివారం జిల్లా కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ లచ్చన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ, గౌతు లచ్చన్న జీవితం ప్రజాసేవ, స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తి, సామాజిక న్యాయం, సమానత్వానికి నిలువెత్తు నిదర్శనమని పేర్కొన్నారు. 1921లోనే స్వాతంత్ర్య ఉద్యమంలో అడుగుపెట్టిన ఆయన ఉప్పు సత్యాగ్రహం నుంచి క్విట్ ఇండియా ఉద్యమం వరకు చురుగ్గా పాల్గొన్నారని తెలిపారు.

శ్రీకాకుళం ప్రాంతంలో రైతులను సంఘటితం చేసి జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారని, అస్పృశ్యతా నిర్మూలన, సామాజిక వివక్షకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం కల్పించారని పేర్కొన్నారు. రైతులు, కార్మికులు, కూలీలు, కల్లు గీత కార్మికులు, పేదలు, వెనుకబడిన వర్గాల హక్కుల కోసం ఆయన జీవితాంతం పోరాడారని కలెక్టర్ తెలిపారు.

ప్రజా సమస్యలను అసెంబ్లీలో బలంగా వినిపిస్తూ పదవులను ప్రజాసేవకు సాధనంగా భావించిన నాయకుడిగా లచ్చన్న గుర్తింపు పొందారని పేర్కొన్నారు. ఆయన ఆశయాలు, సేవా స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శప్రాయమని, వాటి సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ఎం.లక్ష్మీనరసింహం, కలెక్టరేట్ అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొని సర్దార్ గౌతు లచ్చన్నకు ఘనంగా నివాళులర్పించారు.