ఆటో ఢీకొని వృద్ధుడి మృతి…
ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ : ఆటో ఢీకొని వృద్ధుడు మృతి చెందిన సంఘటన మండలంలోని ఇందిరానగర్ బస్టాండ్ వద్ద సిద్దిపేట–హనుమకొండ ప్రధాన రహదారిపై చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణానికి చెందిన మహ్మద్ సలీం భాష (65) బిందెలు, బకెట్లు మరమ్మతు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం ఇందిరానగర్ బస్టాండ్ వద్ద తాగునీరు తెచ్చుకునేందుకు రోడ్డు దాటుతుండగా ఆటో ఢీకొట్టింది.
భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి కూలీలతో కలిసి ఆటోలో దామెర వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన సలీం భాష అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఏఎస్సై శంకర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
