చెరువుల పరిరక్షణ కోసం 65 కి.మీ. పాదయాత్ర..

జన్నారం, ఆంధ్రప్రభ : కబ్జాకు గురవుతున్న చెరువులు, కుంటలను పరిరక్షించాలంటూ మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రేండ్లగూడకు చెందిన సముద్రాల శంకర్ ఆదివారం పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. జాతీయ జెండాను చేతబట్టి, చెరువుల పరిరక్షణకు సంబంధించిన ఫ్లెక్సీని మెడకు తగిలించుకుని ఆయన పాదయాత్ర ప్రారంభించారు. రేండ్లగూడలో కబ్జాకు గురైన అల్లంవారి చెరువుతో పాటు మండలంలోని ఇతర చెరువులు, కుంటలను కాపాడాలని కోరుతూ ఈ యాత్ర చేపట్టినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా జన్నారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి శంకర్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జన్నారం నుంచి సుమారు 65 కిలోమీటర్ల దూరంలోని మంచిర్యాల కలెక్టరేట్‌కు నడక ప్రారంభించారు. ‘చెరువు మా జీవం.. చెరువు మా భవిష్యత్తు’ అంటూ చెరువుల పరిరక్షణ కోసం పోరాటం చేస్తామని శంకర్ తెలిపారు.

మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌ను కలిసి చెరువులను కాపాడాలని కోరుతూ వినతిపత్రం అందజేస్తానని చెప్పారు. కబ్జాకు గురైన చెరువులు, కుంటలను పరిరక్షించేందుకు ప్రారంభించిన పోరాటంపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ చూపాలని శంకర్ కోరారు. ఆయన చేపట్టిన పాదయాత్రకు పలువురు నాయకులు మద్దతు తెలిపారు.