36 ఏళ్ల సేవకు గౌరవం..
- ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డికి ఇండియన్ పోలీస్ మెడల్
- తీవ్రవాద వ్యతిరేక పోరాటం నుంచి ప్రజాసేవ వరకు స్ఫూర్తిదాయక ప్రయాణం
కరీంనగర్ క్రైం, ఆంధ్రప్రభ: మూడు దశాబ్దాలకు పైగా పోలీస్ శాఖలో అంకితభావంతో పనిచేసిన ఇన్స్పెక్టర్ అనుముల నిరంజన్ రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. విశిష్ట పోలీస్ సేవలకు గుర్తింపుగా ఆయనకు ఇండియన్ పోలీస్ మెడల్ లభించింది. 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆయన ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకున్నారు.
కానిస్టేబుల్‌గా మొదలై.. గౌరవ స్థాయికి
1989లో కానిస్టేబుల్‌గా పోలీస్ శాఖలో చేరిన నిరంజన్ రెడ్డి తన సేవా ప్రస్థానాన్ని జగిత్యాల రూరల్‌లో ప్రారంభించారు. విధి నిర్వహణలో భాగంగా తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొని అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. పలు ఎదురుకాల్పుల ఘటనల్లో విధులు నిర్వర్తించి ధైర్యసాహసాలు ప్రదర్శించారు.
1992లో వరంగల్ వెళ్తున్న సమయంలో మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో గాయపడినప్పటికీ ధైర్యంగా పరిస్థితిని ఎదుర్కొని ప్రాణాలతో బయటపడ్డారు. 1994లో సిరిసిల్ల ఎన్నికల సమయంలో వీర్నపల్లిలో సీఆర్పీఎఫ్ క్యాంపు గైడ్‌గా పనిచేసి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా కృషి చేశారు. పలు సందర్భాల్లో బాంబులు, ఆయుధాల స్వాధీనంలో కీలక పాత్ర పోషించారు.
పోలీసు విధులతో పాటు ప్రజాసేవ
ఎస్ఐగా, అనంతరం 2013లో గొల్లపల్లి ఎస్ఐగా పనిచేసిన సమయంలో నిరంజన్ రెడ్డి పోలీస్ బాధ్యతలతో పాటు సామాజిక కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇచ్చారు. ప్రతి ఏడాది బాలల దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు మారుమూల గ్రామాల్లో సుమారు 10 వేల మందికి ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. పోలీస్ ఉద్యోగాలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు శిక్షణ అందించడంలోనూ ఆయన కీలకంగా వ్యవహరించారు.
డ్రగ్స్ నిర్మూలనపై ప్రత్యేక దృష్టి
2023లో సీఐగా పదోన్నతి పొందిన అనంతరం మెట్పల్లిలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించారు. విద్యార్థుల్లో మాదకద్రవ్యాలపై అవగాహన పెంచేందుకు కౌన్సెలింగ్ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుతం కరీంనగర్ రూరల్ సీఐగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలతో పాటు డ్రగ్స్ నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్నారు.
తన 36 ఏళ్ల సుదీర్ఘ సేవా ప్రస్థానంలో నిరంజన్ రెడ్డి ఇప్పటికే ముఖ్యమంత్రి సేవా పతకం, ఉత్తమ సేవా పతకంతో పాటు 82 క్యాష్ రివార్డులు, 64 జీఎస్‌ఈలు, 24 ప్రశంసా పత్రాలు అందుకున్నారు.
పురస్కారం అందుకున్న అనంతరం నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ గౌరవం ప్రజల సహకారం, ఉన్నతాధికారుల మార్గదర్శనం, సహచర సిబ్బంది కృషికి దక్కిన గుర్తింపు అని తెలిపారు.
