శ్రీశైలం పుణ్యక్షేత్రంలో భారీగా ట్రాఫిక్ జామ్
- 9 కిలోమీటర్ల మేర రోడ్డుకు ఇరువైపులా నిలిచిన వాహనాలు
- భక్తులు, మహిళలు, చిన్నారులకు తీవ్ర ఇబ్బందులు
నంద్యాల, ఆంధ్రప్రభ : వరుస సెలవుల నేపథ్యంలో శ్రీశైలం పుణ్యక్షేత్రానికి భక్తులు భారీగా తరలిరావడంతో శనివారం తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో భక్తులు, మహిళలు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సుమారు 9 కిలోమీటర్ల మేర సున్నిపెంట నుంచి సాక్షి గణపతి ఆలయం వరకు రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. నంద్యాల, దోర్నాల, సున్నిపెంట మార్గాలతో పాటు హైదరాబాద్ నుంచి శ్రీశైలం వస్తున్న వాహనాలతో రహదారులు రద్దీగా మారాయి.
ట్రాఫిక్‌లో చిక్కుకున్న ప్రయాణికులు, చిన్నారులకు శ్రీశైలం దేవస్థానం అధికారులు బిస్కెట్లు, పాలు అందించారు. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు చర్యలు చేపట్టారు. రోడ్డుపై నిలిచిపోయిన వాహనాలను క్రేన్ల సహాయంతో పక్కకు తరలించారు. సుమారు సాయంత్రం 6 గంటల సమయంలో ట్రాఫిక్ క్రమంగా క్లియర్ కావడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. శ్రీశైలం వెళ్లే భక్తులు రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రయాణ సమయాన్ని ముందుగా ప్రణాళిక చేసుకోవాలని దేవస్థానం అధికారులు సూచించారు.
