పాఠశాల విద్యార్థుల కోసం విద్యాసామగ్రి వితరణ
తాడ్వాయి, ఆంధ్రప్రభ : సాంకేత్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో తాడ్వాయి మండలం సోమారం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థుల కోసం ప్రొజెక్టర్, తెర, ఫ్యాన్లను విరాళంగా అందించారు. గ్రామీణ విద్యార్థులకు డిజిటల్ విద్యను అందించాలనే ఉద్దేశంతో తాడ్వాయి మండలం సోమారం గ్రామానికి చెందిన కమిశెట్టి సంతోష్ హైదరాబాద్కు చెందిన సాంకేత్ స్వచ్ఛంద సంస్థను సంప్రదించారు.
సంస్థ సానుకూలంగా స్పందించి స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాలకు రూ.53 వేల విలువైన ప్రొజెక్టర్, తెరను అందించింది. అలాగే గ్రామంలోని రెండు అంగన్వాడీ కేంద్రాలకు ఫ్యాన్లు, విద్యాసామగ్రిని అందించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం ఇలాంటి విరాళాలు అందించిన స్వచ్ఛంద సంస్థకు గ్రామస్థులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకుడు మురళి ఫణికుమార్, అధ్యక్షురాలు మమత, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, సర్పంచ్ వినోదమ్మ, ఉపసర్పంచ్ కాట్రోత్ రమేష్, గ్రామస్థులు, ప్రధానోపాధ్యాయుడు రవికాంత్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
